Site icon NTV Telugu

Siromundanam Case: 27 ఏళ్లుగా విచారణ.. నేడు శిరోముండనం కేసులో కీలక తీర్పు

Siromundanam Case

Siromundanam Case

Siromundanam Case: 1996 డిసెంబర్ 29.. రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో దళితయువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో ఇద్దరికి గుండుకొట్టించి, కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈకేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు.. మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు.. ఇక ఈకేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు

1997 జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/1997గా ఎఫ్ఐఆర్ నమోదయింది.. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు.. అయితే, 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.. ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్ లు గా పని చేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు..

పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం , ఈవ్ టీజింగ్ కేసులను అక్రమంగా బనాయించి గ్రామస్తుల మధ్యలో ఘోరంగా అవమానించారని కోర్టుకు తెలిపారు బాధితులు… తోట త్రిమూర్తులు మాత్రం గ్రామ పెద్దల మధ్య జరిగిన పంచాయతీ అని తనకు సంబంధం లేదని చెప్తూ వస్తున్నారు. ఈ కేసు విచారణ హైకోర్టు వరకు వెళ్ళింది.. బాధితులు దళితులు కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని కొన్నాళ్ళు చర్చ జరిగింది.. కుల ధ్రువీకరణ పత్రం పై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ను కూడా ఆదేశించారు. అయితే ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈనెల మూడు వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది.. ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని ప్రకటించింది.. దాంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.. ఎన్నికల సమయం కూడా కావడంతో చర్చగా మారింది.. ఎన్నికల హడావుడి కూడా ఉండడంతో తోట త్రిమూర్తులు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు . అయితే వెంకటాయపాలెం బాధితులు తమకు జరిగిన అన్యాయానికి గానూ..తోట త్రిమూర్తులతో పాటు మిగిలిన వారికి శిక్ష పడాలని కోరుతున్నారు.

Exit mobile version