NTV Telugu Site icon

Today Business Headlines 21-03-23: ఇండియాలో అతిపెద్ద స్టోర్‌ హైదరాబాద్‌లో. మరిన్ని వార్తలు

Today Business Headlines 21 03 23

Today Business Headlines 21 03 23

Today Business Headlines 21-03-23:

భారత్‌లో అతిపెద్ద స్టోర్‌

ఫ్రాన్స్‌కు చెందిన పురుషుల దుస్తుల బ్రాండ్‌.. సిలియో.. భారతదేశంలో అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని శరత్‌ సిటీ మాల్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు వేల అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్టోర్‌ మొట్టమొదటి కాన్సెప్ట్‌ స్టోర్‌ అని కంపెనీ ఇండియా సీఈఓ సత్యన్‌ మోమయి చెప్పారు. సిలియోకి హైదరాబాద్‌లో ఇది ఏడో స్టోర్‌ కావటం విశేషం. మెట్రో సిటీల్లో రిటైల్‌ నెట్‌వర్క్‌ని విస్తరించే లక్ష్యంలో భాగంగా ఈ స్టోర్‌ని లాంఛ్‌ చేసింది. దీంతో.. ఇండియా మొత్తమ్మీద సిలియో స్టోర్ల సంఖ్య 65కి పెరిగింది.

ఆర్‌బీఎల్‌కి ఆర్బీఐ ఫైన్‌

రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. ఆర్‌బీఎల్‌కి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఆర్‌బీఐ.. 2 కోట్ల 27 లక్షల రూపాయల జరిమానా విధించింది. రూల్స్‌ పాటించనందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది. వసూళ్ల ఏజెంట్లకు సంబంధించిన రూల్స్‌ పాటించలేదని స్పష్టం చేసింది. అయితే.. కస్టమర్లతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. వాటిని ప్రస్తావించే ఉద్దేశం తమకు లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

‘కాకినాడ’కు వెయ్యి కోట్లు

ఏపీలోని కాకినాడకు దగ్గరలో ఏర్పాటుచేయనున్న కొత్త యూనిట్‌ కోసం ఏడాది కాలంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నట్లు దివిస్‌ ల్యాబొరేటరీస్‌ తెలిపింది. ప్లాంట్‌ నిర్మాణ పనుల ప్రారంభానికి కావాల్సిన ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చాయని, ఇక శంకుస్థాపన చేయటమే ఆలస్యమని తెలిపింది. ఈ యూనిట్‌పై మొత్తమ్మీద 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని భావిస్తోంది. ఈ పెట్టుబడిని దశలవారీగా చేస్తామని, దీనికి ప్రతిఫలం 2024-25వ సంవత్సరం నుంచి వస్తుందని పేర్కొంది. కాకినాడ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం యూనిట్లపై ఆధారపడటం తగ్గుతుందని ఆశిస్తోంది.

సిగ్నిటీ టెక్నాలజీస్‌లోకి

క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఇండియా మాజీ చైర్మన్‌ కందుల శ్రీనివాస్‌.. సిగ్నిటీ టెక్నాలజీస్‌ సంస్థ బోర్డ్‌లోకి రానున్నారు. దీనిపై బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఈ నెల 27న నిర్ణయం తీసుకోనున్నారు. కందుల శ్రీనివాస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో.. ఐగేట్‌ మరియు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థల్లో కూడా సేవలందించారు. క్యాప్‌జెమినీలో సీఈఓగా మరియు గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సైతం సర్వీస్‌ చేశారు.

3 బ్యాంకుల అప్‌డేట్స్

ఆర్థిక సమస్యల నేపథ్యంలో 2 అంతర్జాతీయ బ్యాంకులు చేతులు మారగా మరో బ్యాంక్‌ రెండుగా విడిపోయింది. యాజమాన్యం మారిన బ్యాంకుల్లో ఒకటి.. క్రెడిట్‌ సూయిజ్‌ కాగా మరొకటి.. సిగ్నేచర్‌ బ్యాంక్‌. క్రెడిట్‌ సూయిజ్‌ని యూబీఎస్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ వ్యాల్యూ 26 వేల 650 కోట్ల రూపాయలు. 60 శాతం డిస్కౌంట్‌కే సేల్‌ ఓకే కావటం గమనించాల్సిన విషయం. గత వారం దివాలా తీసిన సిగ్నేచర్‌ బ్యాంక్‌ను న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యాంక్‌కు విక్రయించారు. ఈ ఒప్పందం విలువ 270 కోట్ల డాలర్లు. ఇక.. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను కొనుక్కునేందుకు ఏ సంస్థా ఆసక్తి చూపకపోవటంతో రెండుగా విభజించి అమ్మాలని నిర్ణయించారు.

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కట్‌

ఇండియాలో ఉత్పత్తి చేసే టన్ను క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని 3 వేల 500 రూపాయలకు తగ్గించారు. ఇది అంతకుముందు 4 వేల 400 రూపాయలుగా ఉండేది. మరోవైపు.. లీటర్‌ డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని అర్ధ రూపాయి నుంచి రూపాయికి పెంచారు. పెట్రోల్‌ మరియు విమాన ఇంధనాన్ని ఎక్స్‌పోర్ట్‌ లెవీ నుంచి మినహాయించారు. ఈ నిర్ణయాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని తగ్గించటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ పన్నుల రేట్లను ప్రతి 15 రోజులకొకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.