Site icon NTV Telugu

Today Business Headlines 20-03-23: దొంగదారిలో బంగారం. మరిన్ని వార్తలు

Today Business Headlines 20 03 23

Today Business Headlines 20 03 23

Today Business Headlines 20-03-23:

2030కి ఇ-కామర్స్

2030 నాటికి ఇండియా ఇ-కామర్స్ ఎగుమతుల లక్ష్యాన్ని 35 వేల కోట్ల డాలర్లుగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్.. GTRI సూచించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యే ఆటంకాలను ప్రభుత్వం తొలగించాలని కోరింది. ప్రస్తుతం మన దేశం చేస్తున్న ఇ-కామర్స్ ఎగుమతుల విలువ 200 కోట్ల డాలర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఇండియా మొత్తం ఎగుమతుల్లో ఈ వాటా కేవలం సున్నాపాయింట్ 5 శాతమే. GTRIని మేధావుల వర్గంగా పేర్కొంటారు. 200 కోట్ల డాలర్ల రేంజ్ నుంచి ఏడేళ్లలో 35 వేల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవటం అనేది చాలా పెద్ద లక్ష్యమని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం స్మగ్లింగ్

మన దేశంలోకి బంగారం స్మగ్లింగ్ రోజురోజుకీ పెరుగుతోంది. 2020లో 2 వేల 154 కిలోలు, 2021లో 2 వేల 383 కేజీలు, 2022లో 3 వేల 502 కిలోల బంగారాన్ని దొంగతనంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం.. తనిఖీలను, నిఘాను పెంచింది. ఫలితంగా ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 916 కేజీల బంగారం తెస్తూ పట్టుబడ్డారు. స్మగ్లింగ్ తగ్గాలంటే దిగుమతి పన్నులు తగ్గించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. కానీ.. దిగుమతి తగ్గించేందుకే పన్నులు విధిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

మహాలక్ష్మి ప్లాంట్

తెలంగాణకు చెందిన స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి సంస్థ మహాలక్ష్మి ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. కొత్తగా మెగా ప్లాంటును ఏర్పాటుచేయబోతోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది ప్రారంభం కానుంది. ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం కింద ఒప్పందం కుదుర్చుకుంది. ఖరీదైన దిగుమతులకు బదులుగా స్పెషాలిటీ ఉక్కు తయారీకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.

యూపీఐ, రూపేలు

యూపీఐ మరియు రూపే వంటి చెల్లింపు వ్యవస్థలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. జీ20 దేశాలకు ఇండియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు. యూపీఐ మరియు రూపే నెట్’వర్క్’లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటం ద్వారా ఇండియన్ ఎకానమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేరువ అవుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరికీ, ప్రతి చోటా, ప్రతిసారీ ఆన్-లైన్ చెల్లింపులు అందించటమే ఆర్బీఐ పేమెంట్స్ విజన్-2025 లక్ష్యమని శక్తికాంతదాస్ వివరించారు.

దేవుడిలా చూడాలి

బ్యాంకులు.. కస్టమర్లను దేవుడిలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ అన్నారు. బ్యాంకింగ్ సర్వీసులు మెరుగుపడాలని సూచించారు. లోపాలను తగ్గించుకోవటంపై ఫోకస్ పెడితే ఇది సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఖాతాదారులు కూడా సకాలంలో స్పందించి రుణాలను తిరిగి చెల్లించాలని కోరారు. వినియోగదారులు లోన్లు కడితేనే బ్యాంకులు ఆర్థికంగా నిలబడతాయని చెప్పారు. బ్యాంకింగ్ పరిశ్రమ.. చిన్న, సన్నకారు రైతులు, యువత, మహిళలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని తెలిపారు.

‘వీకో’ ప్రచారకర్తగా

వీకో ల్యాబ్స్ ఉత్పత్తి చేసే షేవింగ్ క్రీమ్’కి బ్రాండ్ అంబాసిడర్’గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరించనున్నారు. ఈ కంపెనీ ప్రొడక్టులు ప్రతిఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలని ఈ సందర్భంగా గంగూలీ పేర్కొన్నారు. వీకో సంస్థ ఈమధ్య పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్’లోకి తెచ్చింది. చర్మ వ్యాధులు, ఒళ్లు నొప్పులు, దంత సమస్యలను నయం చేసే ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఇందులో ఉన్నాయి.

Exit mobile version