NTV Telugu Site icon

Today Business Headlines 18-03-23: తెలంగాణకు కేంద్రం ‘మెగా’ సాయం

Today Business Headlines 18 03 23

Today Business Headlines 18 03 23

Today Business Headlines 18-03-23:

తెలంగాణ సహా 7 రాష్ట్రాలకి..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లను కేటాయించింది. ఈ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు మూడు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ పార్కులు.. ఫామ్‌, ఫైబర్‌, ఫ్యాక్టరీ, ఫ్యాషన్‌, ఫారన్‌ అనే 5 ఎఫ్‌ విధానంతో జౌళి రంగానికి ఊతమిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మేకిన్‌ ఇండియా.. మేక్‌ ఫర్‌ ద వరల్డ్‌కి ఇవి గ్రేట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఐఐ ‘దక్షిణ’ చైర్మన్‌గా..

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ దక్షిణ ప్రాంత విభాగానికి కొత్త నాయకత్వం వచ్చింది. చైర్మన్‌గా కమల్‌ బాలి, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ ఆర్‌.నందిని ఎంపికయ్యారు. కమల్‌ బాలి.. వోల్వో గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఐఐ దక్షిణ ప్రాంత విభాగానికి డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. సీఐఐ కర్ణాటక చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. నందిని.. చంద్ర టెక్స్‌టైల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో సీఐఐ తమిళనాడు విభాగానికి చైర్‌పర్సన్‌గా చేశారు.

హైదరాబాద్‌లో ‘నామ్‌ధారీ’

నామ్‌ధారీ గ్రూపు.. హైదరాబాద్‌లో సింప్లీ నామ్‌ధారీ రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ విక్రయ కేంద్రంలో 30 వేలకు పైగా ఉత్పత్తులు ఉన్నాయి. నామ్‌ధారీ కంపెనీ విత్తనాలు వాడుతున్న రైతుల నుంచి ఈ ప్రొడక్టులను సేకరించారు. ఈ సంస్థ.. రైతులతో కలిసి పనిచేస్తూ కస్టమర్లకు కావాల్సిన నిత్యవసరాలను అందుబాటులోకి తెస్తోంది. భాగ్యనగరంలోనే త్వరలో నాలుగు స్టోర్లను లాంఛ్‌ చేయనుంది. విత్తనాల అమ్మకాలకు సంబంధించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంక్‌ని రానున్న రోజుల్లో మరింత మెరుగుపరచుకోనుంది.

షేర్‌ విలువ 9%కి పైగా జంప్‌

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌ షేర్ల విలువ 2 రోజుల్లోనే 9 శాతానికి పైగా పెరిగింది. దీంతో ఒక్కో స్టాక్‌ వ్యాల్యూ 377 రూపాయల 50 పైసలకు చేరింది. గురుగ్రామ్‌లోని 11 వందల 37 లగ్జరీ అపార్ట్‌మెంట్లని విక్రయించామని, ఒక్కో అపార్ట్‌మెంట్‌ విలువ 7 కోట్ల రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయని తెలిపింది. ఈ సేల్స్‌ ద్వారా మూడు రోజుల్లోనే 8 వేల కోట్ల రూపాయలకు పైగా బిజినెస్‌ చేశామని పేర్కొంది. ప్రి-ఫార్మల్‌ లాంచ్‌ సేల్స్‌కి సంబంధించి ఇది రికార్డ్‌ బ్రేకింగ్‌ అని రెగ్యులేటరీ సంస్థకు సమర్పించిన నివేదికలో డీఎల్‌ఎఫ్‌ వెల్లడించింది.

తగ్గిన విదేశీ మారక నిల్వలు

ఇండియా విదేశీ మారక నిల్వలు 2 పాయింట్‌ 4 బిలియన్‌ డాలర్లు పడిపోయాయి. ఫలితంగా 560 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫారన్‌ కరెన్సీ అసెట్లు తగ్గిపోవటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఈ వివరాలను ఆర్‌బీఐ ప్రకటించింది. అంతకుముందు వారం కూడా విదేశీ మారక నిల్వలు 2 పాయింట్‌ 2 బిలియన్‌ డాలర్లు కరిగిపోయి 494 పాయింట్‌ ఎనిమిదీ ఆరు బిలియన్‌ డాలర్లకు చేరాయి.

BPCL చైర్మన్‌గా నియామకం

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. BPCL కొత్త చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జి.కృష్ణకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈయన ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఎండీ పోస్టులో 2025 ఏప్రిల్‌ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతున్నారు. అరుణ్‌ కుమార్‌ సింగ్‌ గతేడాది అక్టోబర్‌లో రిటైర్‌ కావటంతో ఆయన స్థానంలో జి.కృష్ణకుమార్‌ వచ్చారు. ఇన్నాళ్లూ రామకృష్ణగుప్తా అడిషనల్‌ ఛార్జ్‌ తీసుకున్నారు.