NTV Telugu Site icon

Today Business Headlines 13-04-23: హైదరాబాద్‌లో జోయా ఫస్ట్ స్టోర్‌ లాంఛ్. మరిన్ని వార్తలు

Today Business Headlines 13 04 23

Today Business Headlines 13 04 23

Today Business Headlines 13-04-23:

సెబీకి ఇకపై కొత్త లోగో

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కొత్త లోగోను ఆవిష్కరించింది. పెట్టుబడి మార్కెట్లను నియంత్రించే ఈ సంస్థ ఏర్పాటై నిన్న బుధవారంతో 35 ఏళ్లు పూర్తయింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త లోగోను రూపొందించారు. 1988 ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమైన సెబీ.. ఈ మూడున్నర దశాబ్దాలుగా పాటిస్తున్న ఉన్నత సంప్రదాయాలు, డేటా మరియు టెక్నాలజీ ఆధారిత వైఖరికి ఈ నూతన చిహ్నం అద్దం పడుతుంది. ఈ విషయాలను సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బుచ్ వెల్లడించారు.

ఆంధ్రా సిమెంట్స్ రీస్టార్ట్

ఆంధ్రా సిమెంట్స్ సంస్థ.. ఉత్పత్తి కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించింది. ఆంధ్రా సిమెంట్స్‌ని సాగర్ సిమెంట్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రొడక్షన్ తిరిగి పట్టాలెక్కటం చెప్పుకోదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దుర్గాపురంలో ఆంధ్రా సిమెంట్స్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఉంది. దుర్గా సిమెంట్ వర్క్స్‌గా పేర్కొనే ఆ ప్లాంట్‌లో గ్రైండింగ్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఆంధ్రా సిమెంట్స్ సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌లో జోయా

టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టైటాన్‌కి చెందిన లగ్జరీ జ్యూలరీ బ్రాండ్ జోయా.. హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టోర్‌ని లాంచ్ చేసింది. దీంతో.. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఉన్న బొటిక్‌ల సంఖ్య 7కి పెరిగింది. జూబ్లీహిల్స్‌లో స్టాండ్ అలోన్ స్టోర్ అయిన ఈ డైమండ్ బొటిక్ ప్రారంభోత్సవంలో హీరో రామ్‌చరణ్‌తేజ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొన్నారు. జోయా కంపెనీకి ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీల్లో బొటిక్‌లు ఉన్నాయి. టైటాన్ టర్నోవర్‌లో జోయా బ్రాండ్ సేల్స్ వ్యాల్యూ 200 కోట్ల రూపాయల వరకు ఉండటం గమనార్హం.

TCS కంపెనీకి లాభం

సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్‌కి గత ఆర్థిక సంవత్సరంలోని 4వ త్రైమాసికంలో 11 వేల 392 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని 4వ క్వార్టర్‌తో పోల్చితే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే.. ఈ ఫలితాలు మార్కెట్ వర్గాలకు రుచించలేదు. ఇదిలాఉండగా.. పోయిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఈ కంపెనీ.. తన వాటాదారులకు ఒక్కో షేర్‌కి 24 రూపాయల ఫైనల్ డెవిడెండ్ ప్రకటించనున్నట్లు తెలిపింది.

దివ్యాంగులకు బెర్తులు

దివ్యాంగులతోపాటు వారి సహాయకులు ప్రయాణించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్పెషల్ బెర్త్‌లను కేటాయించింది. గతంలో ఈ సౌకర్యాన్ని సీనియర్ సిటిజన్లకు, ఒంటరి మహిళలకు లేదా చిన్న పిల్లలతో కలిసి వెళ్లే ఆడవాళ్లకు కల్పించేది. ఇప్పుడు దివ్యాంగులకు కూడా అందజేస్తోంది. కాకపోతే.. ఈ రిజర్వేషన్ సీట్లకు ఛార్జీలను పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుందని నిబంధన విధించింది.

సీయూబీ నయా లాగిన్

సిటీ యూనియన్ బ్యాంక్.. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కి సంబంధించి.. సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. యాప్‌లోకి లాగిన్ కావటానికి వాయిస్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ని అనుసరిస్తోంది. వినియోగదారుల కోసం ఇలాంటి సేఫ్టీ టెక్నిక్‌ని ప్రవేశపెట్టిన దేశంలోనే మొట్టమొదటి బ్యాంక్‌గా నిలిచింది. ఈ మేరకు కైజెన్ సెక్యూర్ వాయిజ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తోంది. ఐడీ, పిన్, ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్‌తోపాటు ఇప్పుడు వాయిస్ బయోమెట్రిక్ అనే మరో లాగిన్ ఆప్షన్ కూడా చేరటం విశేషం.