NTV Telugu Site icon

Today Business Headlines: ఏజీ 365 డ్రోన్‌కి కేంద్ర ప్రభుత్వ అనుమతి

Today (28 12 22) Business Headlines

Today (28 12 22) Business Headlines

Today (28-12-22) Business Headlines:

రికార్డ్ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏడేళ్ల కిందట.. అంటే.. 2014లో.. అత్యధికంగా 3 పాయింట్‌ నాలుగు మూడు లక్షల నివాసాలు సేల్‌ అవగా ఈ సంవత్సరం 3 పాయింట్‌ ఆరు ఐదు లక్షల గృహాల విక్రయాలు జరిగాయి. గతేడాది 25 వేల 406 ఇళ్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 87 శాతం ఎక్కువగా 47 వేల 487 యూనిట్ల విక్రయాలు పూర్తయినట్లు రియల్‌ ఎస్టేట్‌ సర్వీసుల సంస్థ అనరాక్‌ తెలిపింది. ఈ ఏడాది పలుమార్లు బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగటం హౌజింగ్‌ బిజినెస్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొంది.

ఈ నెల 31లోపు ఐటీఆర్‌ దాఖలు

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఈ నెల 31 లోపు దాఖలు చేయాలని ఐటీ విభాగం సూచించింది. నిజానికి ఈ గడువు ఈ సంవత్సరం జులైతోనే పూర్తయింది. అయినప్పటికీ లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ ఆఖరు కల్లా ఐటీఆర్‌లను సమర్పించొచ్చని పేర్కొంది. ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే రాబడి 5 లక్షలు దాటితే 5 వేల రూపాయలు చెల్లించాలి. 5 లక్షల లోపు ఉంటే ఆలస్యపు రుసుము వెయ్యి కట్టాలి. ఈ మేరకు ఇన్‌కం ట్యాక్స్‌ చట్టంలో వెసులుబాటు ఉంది.

దేశం అప్పులు 147 లక్షల కోట్లు

సగటు భారతీయుడి మాదిరిగానే మన దేశం కూడా అప్పుల బారిన పడుతోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి ఇండియా 147 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణపడిపోయింది. దీనిపైన వడ్డీ రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌.. ఈ మూడు నెలల్లోనే.. 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా లోన్లు తీసుకుంది. ఇందులో దాదాపు లక్ష కోట్లను పాత అప్పులకే చెల్లించింది. మొత్తం రుణాల్లో సుమారు 30 శాతాన్ని వచ్చే ఐదేళ్లలోపే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

3 డోసులు తీసుకుంటే డిస్కౌంట్‌

కరోనా నుంచి రక్షణ కోసం బూస్టర్‌ డోస్‌ సహా మూడు టీకాలు వేయించుకున్నవారికి గుడ్‌న్యూస్‌. వీళ్లకి భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. హెల్త్‌ మరియు జనరల్‌ బీమా పాలసీలను రెన్యువల్‌ చేసుకునేటప్పుడు డిస్కౌంట్లు పొందనున్నారు. ఈ ప్రతిపాదనను ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బీమా సంస్థలకు సూచించింది. తమ వెల్‌నెస్‌ నెట్‌వర్క్‌ పరిధిలోని హాస్పిటల్స్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకుంటే స్పెషల్‌ ఇన్‌సెన్‌టివ్స్‌ ఇవ్వాలని కోరింది. కొవిడ్‌ బాధితుల సమస్యల పరిష్కారానికి ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రత్యేకంగా వార్‌ రూమ్‌లను ఏర్పాటుచేయాలని కూడా ఆదేశించింది.

8.2% ఖాతాల్లోనే సున్నా బ్యాలెన్స్‌

ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన పేరుతో బ్యాంకుల్లో తెరిచిన ఖాతాల్లో డిపాజిట్‌ అవుతున్న డబ్బు గత ఎనిమిదేళ్లుగా పెరుగుతూ వస్తోంది. 2022 ఆగస్టు నాటికి మొత్తం 46 కోట్ల 25 లక్షల అకౌంట్లు ఉండగా.. అందులో 81 శాతానికి పైగా ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి. కేవలం 8 శాతానికి పైగా అకౌంట్లలో మాత్రమే జీరో బ్యాలెన్స్‌ ఉంది. ఈ విషయాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ట్రెండ్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. జన్‌ధన్‌ ఖాతాలను తొలిసారిగా 2017లో తెరవటం ప్రారంభించారు. అప్పట్లో 76 శాతం అకౌంట్లలోనే రెగ్యులర్‌గా లావాదేవీలు జరిగేవి.

ఏజీ 365 డ్రోన్‌కు ప్రభుత్వం ఓకే

హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఏజీ 365 డ్రోన్‌కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఇది మన దేశంలోనే మొట్టమొదటి మల్టీ యుటిలిటీ అగ్రికల్చర్‌ మీడియం కేటగిరీ డ్రోన్‌. దీన్ని విమానయాన శాఖ పరిధిలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ధ్రువీకరించిందని మారుత్‌ డ్రోన్స్‌ ఫౌండర్‌ ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ చెప్పారు. డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన రిమోట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ పర్మిషన్‌ కూడా మారుత్‌ డ్రోన్స్‌ కంపెనీకి వచ్చింది. ఈ డ్రోన్‌ సాయంతో పంట నష్టాన్ని, ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా పెట్టుబడి కూడా కలిసొస్తుంది.