Today (22-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లోని 2 కీలక సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా నాలుగో రోజు అంటే ఇవాళ బుధవారం కూడా నేల చూపులు చూశాయి. దీంతో కేవలం ఈ 4 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ముందు ముందు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయనే భయాలు పెట్టుబడిదారులను వెంటాడాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో అమెరికా, రష్యా మధ్య రోజురోజుకీ పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు సైతం దీనికి తోడయ్యాయి. దీంతో ఇవాళ ఒక్క రోజే 3 పాయింట్ 8 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బీఎస్‌ఈలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ 261 లక్షల కోట్ల రూపాయలకు పైగా పతనమైంది.
read more: Air India order support US jobs: బోయింగ్‌కి ఎయిరిండియా ఆర్డర్ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్
గడచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఈ రోజు 60 వేల బెంచ్ మార్క్‌కి దిగువన ఎండ్ అయింది. చివరికి.. సెన్సెక్స్.. 927 పాయింట్లు కోల్పోయి 59 వేల 744 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 272 పాయింట్లు తగ్గి 17 వేల 554 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీలో ఐటీసీ కంపెనీ మాత్రమే బాగా రాణించింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. త్రివేణి టర్బైన్ షేర్ల విలువ సరికొత్త శిఖరమైన 312 రూపాయల 70 పైసలకు చేరింది. మార్కెట్ ఇంత బలహీనంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ సంస్థ స్టాక్స్ విలువ 2 శాతం వరకు పెరగటం చెప్పుకోదగ్గ విషయం. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ల వ్యాల్యూ 6 శాతం ర్యాలీ తీసింది.
రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లూ నెగెటివ్ జోన్‌లోనే ఎండ్ అయ్యాయి. నిఫ్టీ మెటల్ సూచీ రెండున్నర శాతానికి పైగా డౌన్ అయింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ సూచీ ఒకటీ పాయింట్ ఏడు శాతం తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 44 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 56 వేల 124 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 325 రూపాయలు కోల్పోయింది. అత్యధికంగా 65 వేల 727 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 139 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 246 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు బలహీన పడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 89 పైసల వద్ద స్థిరపడింది.