Site icon NTV Telugu

Today (07-02-23) Stock Market Roundup: మార్కెట్‌కి ‘‘మంగళ’’వారం కాదు

Today (07 02 23) Stock Market Roundup

Today (07 02 23) Stock Market Roundup

Today (07-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ పెద్దగా ఆశాజనకమైన పరిస్థితేమీ కనిపించలేదు. ఈ రోజు మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొని చివరికి నష్టాల్లోనే ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన ట్రేడింగ్‌లో కొంత వరకు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇంట్రాడేలో ఫైనాన్షియల్‌ షేర్ల కొనుగోళ్లు జరగటంతో కాస్త ఊరట పొందాయి.

సెన్సెక్స్‌ ఒకానొక దశలో 60 వేల 63 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడే డీల్స్‌ వల్ల నిఫ్టీ.. తిరిగి 17 వేల 700 పాయింట్లకు చేరుకోగలిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేటును పావు శాతం పెంచుతుందేమోననే ఆందోళన ఈక్విటీ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. చివరికి.. సెన్సెక్స్‌.. 220 పాయింట్లు కోల్పోయి 60 వేల 286 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.

read more: Is Shark Tank the next IPL: టీవీ ప్రోగ్రామ్‌ స్థాయి నుంచి బిజినెస్‌ లెవల్‌కి ఎదుగుతోందా?

నిఫ్టీ.. స్వల్పంగా 43 పాయింట్లు తగ్గి 17 వేల 721 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు లాభాల్లో నడవగా 21 సంస్థలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ రియాల్టీ సూచీ పరిమితమైన లాభాలు పొందగలిగింది. కానీ.. నిఫ్టీ మిడ్‌క్యాప్‌100, స్మాల్‌క్యాప్‌100 ఇండెక్స్‌లు సున్నా పాయింట్‌ 8 శాతం వరకు డౌన్‌ అయ్యాయి.

వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే పేటీఎం పేరెంట్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్ల విలువ 3 నెలల గరిష్టానికి.. అంటే.. 669 రూపాయల 60 పైసలకు చేరుకుంది. అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌లో సంస్థ మంచి పనితీరు కనబరచటం కలిసొచ్చింది. టాటా స్టీల్‌ స్టాక్స్‌ విలువ 5 శాతం దిగజారింది. ఇన్వెస్టర్లు లాభాలను సొమ్ముచేసుకోవటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.

10 గ్రాముల బంగారం ధర 165 రూపాయలు పెరిగి గరిష్టంగా 57 వేల 120 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 218 రూపాయలు లాభపడి అత్యధికంగా 67 వేల 617 రూపాయలు పలికింది. క్రూడాయిల్‌ ధర 123 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 6 వేల 254 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 73 పైసల వద్ద స్థిరపడింది.

Exit mobile version