Today (06-01-23) Business Headlines:
ఖమ్మంలో ‘గోద్రెజ్’ ప్లాంట్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆసక్తి ప్రదర్శించింది. ప్రపంచ స్థాయిలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేయనుంది. దీనికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఈ మేరకు ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు నిన్న గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు. ముందుగా.. గంటకు 30 టన్నుల కెపాసిటీ గల ప్లాంట్‌ను ఏర్పాటుచేసి, తర్వాత.. ఆ సామర్థ్యాన్ని 60 టన్నులకు పెంచుతామని చెప్పారు.
రానా దగ్గుబాటి ‘కన్‌ఫం’
ట్రైన్ టికెట్ల బుకింగ్ సర్వీసులను అందిస్తున్న కన్‌ఫం అనే సంస్థకు సినీ నటుడు రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ట్రైన్ టికెట్ టైగర్ పేరుతో ఈ క్యాంపెయిన్ జరగనుంది. రైలు టికెట్లను బుక్ చేసుకున్నప్పుడు కన్‌ఫం కాకుండా వెయిటింగ్ లిస్టులోకి వెళితే అవి కన్‌ఫం అయ్యేందుకు ఎంత వరకు ఛాన్స్ ఉంది? ఒక వేళ కన్‌ఫం కాకపోతే ఏం చేయాలి? అనే సలహాలను, సూచనలను ఈ సంస్థ అందిస్తుంది. ఐఆర్‌సీటీసీతో ఒప్పందం మేరకు కలిసి పనిచేస్తున్న ఈ కంపెనీని 2021లో ఇక్సిగో సంస్థ టేకోవర్ చేసుకుంది.
సెల్ఫ్ డిక్లరేషన్ చాలు
బ్యాంకుల్లో కేవైసీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వ్యక్తిగత వివరాల్లో మార్పులు లేనప్పుడు కేవైసీ రెన్యువల్ సమయంలో వినియోగదారులు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. ఇ-మెయిల్, ఫోన్ నంబర్, ఏటీఎం, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగుల్లో ఏదైనా ఒక రూపంలో స్వీయ ధ్రువీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల్లో ఒకదానిని గుర్తింపు కార్డులాగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
13-18 తేదీల్లో ఆటోఎక్స్‌పో
ఆటో మోటర్ వాహనాల ప్రదర్శన ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరగనుంది. ‘ఆటో ఎక్స్‌పో.. ది మోటర్ షో’ పేరుతో ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కొత్త మోడల్ కార్లు, బైక్‌లు సందర్శకులను అలరించనున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడళ్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. దేశంలోని పెద్ద పెద్ద కార్ల తయారీ సంస్థలన్నీ తమ లగ్జరీ వాహనాలను ప్రదర్శనకు పెట్టనున్నాయి. టూ వీలర్ కంపెనీలు కూడా పాల్గొంటాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎక్స్‌పోను 2022లో కరోనా నేపథ్యంలో నిర్వహించలేదు.
సేల్స్ ఫోర్స్‌లో 8 వేల లేఆఫ్స్
2023వ సంవత్సరం చాలా మందికి హ్యాపీ న్యూఇయర్‌గా నిలిచిందేమో గానీ కొంత మందికి మాత్రం అన్-హ్యాపీ న్యూఇయర్‌గా మారింది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి కనీసం వారం రోజులు కూడా గడవలేదు. అప్పుడే లేఆఫ్ న్యూస్ వినాల్సి వస్తోంది. 2022 చివరలో మొదలైన ఈ ట్రెండ్ నూతన సంవత్సరంలో కూడా కొనసాగుతోంది. తాజాగా.. సేల్స్‌ఫోర్స్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతం మందిని లేదా 8 వేల మందిని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమేజాన్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ అనే సంస్థ కన్నా మరో పది వేల మందిని అదనంగా ఉద్యోగంలోంచి తీసేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీ క్యాంపెయిన్ అదుర్స్
‘‘షైన్ విత్ మి’’ అంటూ ఏసియన్ పెయింట్స్ నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇండియాలోని అతి పెద్ద షార్ట్ వీడియో యాప్ మోజ్‌లో ఈ ప్రచారానికి 293 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 12 మిలియన్‌లకు పైగా లైకులు, 5 లక్షల 57 వేల షేర్లు కూడా లభించటం విశేషం. తమిళం, తెలుగు, కన్నడ.. మూడు భాషల్లో చేపట్టిన ఈ క్యాంపెయిన్‌కి 10 రోజుల్లోనే ఇంత రెస్పాన్స్ రావటం గమనించాల్సి విషయం. ట్రాక్టర్ షైన్ మరియు ఏస్ షైన్ అనే పెయింట్ ప్రొడక్టులకు సంబంధించి ఈ హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్ నిర్వహించింది.
