NTV Telugu Site icon

Titanic Ship: సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ఇలా ఉందా.. శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి

Titanic

Titanic

Titanic Ship: టైటానిక్ షిప్ ఇదో అప్పటివరకు ప్రపంచానికి పరిచయం కానటవంటి భూతల స్వర్గం. ఈ షిప్ సరిగ్గా 111ఏళ్ల కిందట తన తొలిప్రయాణం పూర్తి కాకుండానే సముద్రంలో మునిగిపోయింది. సుమారు 70సంవత్సరాల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. కానీ దాని శకలాలను ఇంతవరకు బయటకు తీయలేకపోయారు. వాటి అన్ని శకలాలకు పూర్తిగా ఒకే ఫోటోలో చూడలేము.. ప్రస్తుతం 7లక్షల చిత్రాలను ఉపయోగించి 3డి స్కాన్ ఫోటో తయారు చేశారు ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది.

టైటానిక్ 1912 ఏప్రిల్‌లో తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లోని సౌథంప్టాన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు తన ప్రయాణం కొనసాగించాలి.. అప్పటి వరకు నిర్మితమైన అతి భారీ ఓడ అయిన టైటానిక్ సంపన్నుల కళ్లు కొల్లగొట్టింది. విలాసావంతమైన ఏర్పాట్లు అన్నీ అందులో ఉన్నాయి. జిమ్నాషియం, స్విమ్మింగ్ పూల్, స్మోకింగ్ రూమ్స్, హై క్లాస్ రెస్టారెంట్లు, కేఫ్‌లు అన్నింటిని ఏర్పాటు చేశారు. ఈ షిప్ 1912లో న్యూయార్క్‌కు బయల్దేరింది. కానీ, మార్గమధ్యంలోనే అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ మంచు కొండను ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. గమ్యస్థానాన్ని చేరుకోకముందే సముద్రంలో మునిగిపోయింది. దీంతో 1,500లకు పైగా ప్రయాణికులు ఈ ప్రమాదంలో మరణించారు. నార్త్ అట్లాంటిక్ ఓషియన్‌లో సుమారు నాలుగు కిలోమీటర్ల లోతున ఆ షిప్‌ శకలాలు పడిపోయాయి.

1985లో కెనడా తీరానికి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో తొలిసారిగా టైటానిక్ షిప్ శకలాలను గుర్తించారు. కానీ, వాటిని చూసిన వారు చెప్పడం వరకే అది జరిగింది. ఫొటోలు తీయడం సాధ్యం కాలేదు. కారణం దాని పొడవు. సుమారు 882 ఫీట్ల పొడవు ఉండటం.. షిప్ మునిగిన తర్వాత అది రెండు ముక్కలై 2,600 అడుగుల దూరంలో పడిపోయింది. దీంతో ఈ భారీ షిప్‌ను ఒక్క ఫొటోగా చూడటం ఇది వరకు సాధ్యం కాలేదు. కానీ, తాజాగా, ఈ చిత్రాలు బీబీసీలో పబ్లిష్ అయ్యాయి. మెగల్లాన్ లిమిటెడ్, అట్లాంటిక్ ప్రొడక్షన్‌లు 2022 నుంచి టైటానిక్ షిప్ ఫుల్ మ్యాప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి డాక్యుమెంటరీ కోసం ఈ రెండు సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. డీప్ సీ మ్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఇవి టైటానిక్ షిప్ ఫుల్ 3డీ డిజిటల్ స్కాన్ సృష్టించాయి. ఇందుకోసం నీటిలోకి ఓ స్పెషలిస్ట్ షిప్‌ను పంపి ఫొటోలు తీసేలా.. దాన్ని బయటి నుంచే ఆపరేట్ చేసేలా స్పెషలిస్టు షిప్‌ను రూపొందించారు. ఆ స్పెషలిస్టు షిప్‌ను టైటానిక్ షిప్ శకలాలు ఉన్న చోటికి పంపించారు. సుమారు 200 గంటలు ఆ షిప్ అక్కడే ఉండి సర్వే చేసింది. సుమారు 7 లక్షల చిత్రాలు తీసింది. వీటన్నింటిని ఉపయోగించి ఫుల్ 3డీ స్కాన్‌ను సృష్టించారు. ఇప్పుడు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనమయ్యాయి.