Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.. సంవత్సరాంతం కావడంతో.. సెలవు దినాలు ఉండడంతో.. శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. దీనితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న 9 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి కృష్ణ తేజ సర్కిల్ నుంచి అక్టోపస్ సర్కిల్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండడంతో సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నిలిపివేసింది టీటీడీ.
Read Also: ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
ఇక, సర్వదర్శనం భక్తులు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలంటూ సూచిస్తుంది టీటీడీ.. మరోవైపు భక్తుల తాకిడితో తిరుమలలో ఎటు చూసినా భక్తులు వేచి ఉన్న క్యూలైన్లే కనిపిస్తున్నాయి. అలిపిరి నుంచి భక్తుల తాకిడి కనిపిస్తుంది. అలిపిరి వద్ద సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్ కేంద్రం వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం వారికి టోకెన్లు అందకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు తర్వాత అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాల తనిఖీ ప్రక్రియ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, తిరుమలకు విచ్చేసిన భక్తులు తలనీలాలు సమర్పించడానికి, అటు తర్వాత వసతి గదులు పొందడానికి స్వామివారి దర్శనం కోసం అనంతరం లడ్డూ ప్రసాదం స్వీకరించడం ఇలా అన్నిచోట్ల క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి.. అయితే, భక్తుల తాకిడి మరో 10 రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైకుంఠ ద్వారా దర్శనం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు..
