Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!

  • పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తిలక్
  • మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయడం తనకు ఇష్టమని వ్యాఖ్య
  • వరల్డ్ కప్‌, అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని వెల్లడి..
Thilak Varma

Thilak Varma

Tilak Varma: ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ తన బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై విజయానికి కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ.. తనకు మ్యాచ్‌లను ఫినిష్ చేయడం అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు.

“నేను ఎప్పుడూ మ్యాచ్‌లను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయాలని చూస్తాను. వరల్డ్ కప్స్‌, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఎంతో అనుభవం వచ్చింది. అదే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ వికెట్ చాలా స్లోగా, తక్కువ బౌన్స్‌తో ఉండటాన్ని ముందుగా ఊహించలేదు. పంజాబ్ బ్యాటర్లు తొలి 15 ఓవర్లలో ఎలా ఇబ్బంది పడ్డారో చూశాం. అందుకే మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం” అని తిలక్ తెలిపాడు.

తన ఇన్నింగ్స్‌లో కీలకంగా మారిన చాహల్ వేసిన 16వ ఓవర్ గురించి కూడా తిలక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. “రెండో టైమ్‌ ఔట్ సమయంలో కోచ్‌తో మాట్లాడాను. ఒక పెద్ద ఓవర్ వస్తే మ్యాచ్ ముగించేస్తామని, నన్ను నమ్మాలని చెప్పాను. ఆ ఒక్క అవకాశానికే ఎదురుచూశాను. చివరకు అదే జరిగింది. మ్యాచ్‌ ను ఫినిష్ చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని చెప్పాడు.

అలాగే సహచర ఆటగాడు విల్ జాక్స్ ఇన్నింగ్స్‌పై కూడా తిలక్ ప్రశంసలు కురిపించాడు. జాక్స్ ఇన్నింగ్స్ మాకు చాలా కీలకం అయింది. నేను అతనికి షాట్లు ఆడేటప్పుడు షేప్‌ను నిలబెట్టుకోవాలని, స్లోయర్ బంతుల కోసం వేచి ఉండాలని చెప్పాను. మేము ఎక్కువగా ఇబ్బంది పడింది ఆ బంతులకే. కానీ అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి సిక్సర్లు బాదడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. ఒత్తిడి సమయంలోనూ ప్రశాంతంగా ఆడి ముంబైకి విజయాన్ని అందించిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఇప్పుడు అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.