Site icon NTV Telugu

Brazil Shootings: స్కూళ్లలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు మృతి

Brazil Shootings

Brazil Shootings

Brazil Shootings: బ్రెజిల్‌లో పాఠశాలల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని రెండు పాఠశాలలపై ఓ వ్యక్తి శుక్రవారం కాల్పులు జరపడంతో ఓ బాలికతో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించిన ఓ షూటర్ ఆగ్నేయ బ్రెజిల్‌లోని రెండు పాఠశాలలపై దాడి చేసి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థిని కాల్చి చంపినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. కాగా మరో 11 మంది గాయపడ్డారని కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి.

శుక్రవారం తెల్లవారుజామున ఎస్పిరిటో శాంటో రాష్ట్రంలోని అరక్రూజ్ పట్టణంలో గల పాఠశాలలో ఉపాధ్యాయుల బృందంపై నిందితుడు కాల్పులు జరిపాడని.. ఆ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని చెప్పారు.అనంతరం ఆ దుండగుడు మరొక పాఠశాలకు వెళ్లి అక్కడ కాల్పులు జరపాడు. ఆ పాఠశాలలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ దాడులు చేసిన అనుమానిత షూటర్‌ను అధికారులు అరెస్టు చేసినట్లు రాష్ట్ర గవర్నర్ రెనాటో కాసాగ్రాండే తెలిపారు. దీనిపై విచారణ జరిపి త్వరలో మరింత సమాచారం సేకరిస్తామని గవర్నర్ ట్వీట్ చేశారు.

Border Dispute: మేఘాలయలో మరో 49 గంటలపాటు ఇంటర్‌నెట్ బంద్

బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తాజా కాల్పులను “అసంబద్ధ విషాదం”గా అభివర్ణించారు. ఈ దాడుల గురించి తెలుసుకుని బాధపడ్డానని అని ట్విట్టర్‌లో రాశారు.‘‘దాడుల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ కాసాగ్రాండేకు నా పూర్తి మద్దతు ఉంది’’ అని రాసుకొచ్చారు. గతంలో 2003 నుండి 2010 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గత నెలలో జరిగిన ఎన్నికలలో జైర్ బోల్సోనారోను ఓడించి జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

బ్రెజిల్‌లో పాఠశాల కాల్పులు చాలా అరుదు. కానీ ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్నాయి. బ్రెజిల్‌లోని అత్యంత ఘోరమైన పాఠశాల కాల్పుల్లో 2011లో 12 మంది పిల్లలు చనిపోయారు, రియో డి జెనీరో శివారులోని రియాలెంగోలోని తన పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి కాల్పులు జరిపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో ఇద్దరు మాజీ విద్యార్థులు సావో పాలో వెలుపల ఉన్న సుజానోలోని ఒక ఉన్నత పాఠశాలలో ఎనిమిది మందిని కాల్చి చంపారు, ఆపై వారి ప్రాణాలను కూడా తీసుకున్నారు.

Exit mobile version