Site icon NTV Telugu

Election Results 2023: నవరత్నాల్లో గెలిచిన త్రిమూర్తులు.. ఎన్నికల్లో బయటపడ్డ ముగ్గురు మంత్రులు

Brs Ministers

Brs Ministers

Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓటిమి బాటపట్టారు. జనాల్లో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్లు విజయం సాధించారు. అలాంటి వారిలో సనత్‌నగర్‌లో మంత్రి తలసాని, మహేశ్వరంలో సబితారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి బరిలో నిలిచారు. సనత్‌నగర్‌, మహేశ్వరంలో త్రిముఖ పోరు సాగింది. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచిత్తుగా ఓడించి మంత్రులు విజయం సాధించారు.

మాస్ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోయినా మంత్రి మల్లారెడ్డి మరోసారి విజయం సాధించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఈసారి తోటకూరు వజ్రేష్ యాదవ్ పై మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రముఖ విద్యాసంస్థ అధినేతగా 2014లో టీడీపీ తరపున తొలిసారిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. 2014లో ఎంపీ అయిన ఆయన.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి బదులు మల్లార్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. మల్లారెడ్డి విజయం తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు.

తలసాని హ్యాట్రిక్

సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ హ్యాట్రిక్‌ సాధించారు. మొత్తం మీద ఆరుసార్లు గెలిచాడు. ఒక ఉప ఎన్నికతో పాటు సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు, సనత్ నగర్ నుంచి మూడుసార్లు గెలిచారు. 2014 వరకు తలసాని టీడీపీలో ఉన్న వీరు.. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. 2018లో విజయం సాధించి మళ్లీ మంత్రి అయ్యారు. 2018లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్‌పై గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి తుల ఉమపై విజయం సాధించారు.

సబిత విజయం

మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఐదోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబిత ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ ఎస్ లో చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేసి ఐదోసారి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై భారీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై తొమ్మిది వేల ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే..
Congress Cabinet: నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది

Exit mobile version