Safest City: వరసగా మూడో ఏడాది కూడా ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇతర నగరాలో పోలిస్తే నేరాలు తక్కువగా నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తన నివేదికలో తెలిపింది. మహానగరాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు అతి తక్కువ నేరాలు నమోదు చేసిందని వెల్లడించింది. 2022లో ఈ నగరంలో ప్రతీ లక్ష మందికి 86.5 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి.
కోల్‌కతా తర్వాత పూణే(280.7), హైదరాబాద్ (299.2) ఉన్నాయని NCRB డేటా పేర్కొంది. భారత శిక్షాస్మృతి (IPC) మరియు SLL (ప్రత్యేక మరియు స్థానిక చట్టాలు) సెక్షన్ల కింద నమోదైన కేసులను కాగ్నిజబుల్ నేరాలుగా గుర్తిస్తారు. ఎన్సీఆర్బీ వివేదిక ప్రకారం.. కోల్‌కతాలో 2021లో లక్ష మందికి 103.4 కాగ్నిజబుల్ నేరాలు నమోదు కాగా.. 2022లో 86.5కి పడిపోయింది. 2020లో ఈ సంఖ్య 129.5గా ఉంది.
Read Also:Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..? నిర్ణయం పూర్తైందన్న రాహుల్ గాంధీ..
2021లో పూణే, హైదరాబాద్ నగరాల్లో లక్ష మందికి 256.8, 259.9 నేరాలు నమోదయ్యాయి. 20 లక్షల కన్నా అధిక జనాభా ఉన్న 19 నగరాల్లో నేరాలను పోల్చి చూసి ఈ జాబితా విడుదల చేశారు. ఇదిలా ఉంటే కోల్‌కతాలో మహిళలపై నేరాలు పెరిగాయని, 2021లో ఈ సంఖ్య 1,783గా ఉంటే, 2022 నాటికి 1890కి పెరిగిందని పేర్కొంది.
కోల్‌కతాలో మహిళలపై నేరాలు లక్షకు 27.1 శాతంగా ఉంది, కోయంబత్తూర్ లో 12.9, చెన్నైలో 17.1గా ఉన్నాయి. ఈ ఏడాది కోల్‌కతాలో హింసాత్మక నేరాలు తగ్గాయని, కేవలం 34 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయని, 2021లో ఇది 45గా ఉండేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. 2022లో కోల్‌కతాలో 11 అత్యాచారాలు నమోదైనట్లు తెలిపింది. NCRB నివేదిక ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ఏజెన్సీల నుండి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది.