NTV Telugu Site icon

INDvsAUS Tests: మూడో టెస్టు వేదిక మారడం టీమిండియాకు కలిసొస్తుందా?

111

111

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో విక్టరీ అందుకుంది. ప్రస్తుతం అదే జోరులో రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. కాగా, ఈ సిరీసులో భాగంగా జరగాల్సిన మూడో టెస్టు వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ కోసం స్టేడియం సిద్ధంగా లేదని, అక్కడ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను ఇండోర్‌కు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. అలా అనడానికి కారణాలు లేకపోలేదు.

Also Read: HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

టీమిండియాకు తిరుగులేదు..

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం ఒక విధంగా భారత్‌కు కంచుకోట. ఈ మైదానంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాత్రమే భారత్ ఓడింది. ఆ తర్వాత కానీ, అంతకుముందు కానీ ఈ స్టేడియంలో భారత్‌కు ఓటమన్నదే లేదు. ఇక్కడ కివీస్‌తో జరిగిన టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 13 వికెట్లతో చెలరేగడంతో భారత్ 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే బంగ్లాదేశ్‌పై కూడా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలిచింది. ఇక్కడ టీమిండియా ఒక్కసారి కూడా ఆలౌట్ అవ్వకపోవడం గమనార్హం. ఈ రికార్డులన్నీ చూస్తుంటే మూడో టెస్టులో భారత్‌ విజయం ఖరారైనట్లే కనిపిస్తోంది.

Also Read: Jagapathi Babu: పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశా.. చిన్నదానికి నేను పెళ్లి చేయను

ఆసీస్‌కు మాత్రం దెబ్బే..

ధర్మశాలలో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఈ టెస్టులోనైనా తమ సత్తా చూపించాలని ఎదురుచూస్తున్న ఆసీస్ బౌలర్లకు ఇది కాస్త నిరాశపర్చే వార్తే. చివరగా ఇక్కడ ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్‌లో కెప్టెన్ కమిన్స్ నాలుగు వికెట్లతో రాణించాడు. దీంతో మూడో టెస్టులో భారత జట్టును కమిన్స్ ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఇక్కడి నుంచి మ్యాచ్ వేదిక మార్చడంతో ఆసీస్‌కు ఈ అడ్వాంటేజి లేకుండా పోయింది. హోల్కర్ స్టేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఆసీస్ పేసర్లకు రాణించే అవకాశం లేకుండా పోయింది.

Also Read: Ford Layoff: ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాలు కట్..ఇంజినీర్ల విభాగంలోనే ఎక్కువ!

కోహ్లీకి మంచి రికార్డు..

ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే అతడు టెస్టుల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అయితే ఇండోర్‌లో కూడా కోహ్లీ రికార్డు చాలా గొప్పగా ఉంది. కాబట్టి మూడో టెస్టులో మాత్రం అతను మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏడేళ్ల క్రితం ఇక్కడే అజింక్యా రహానేతో కలిసి 365 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్. ఆ మ్యాచ్‌లోనే తొలిసారి కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఆసీస్ బౌలర్లకు ఇక్కడ కోహ్లీ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఏ విధంగా చూసినా మూడో టెస్టు వేదిక మార్చడం టీమిండియాకు అన్ని విధాలా కలిసొచ్చేదే.

Also Read: Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు