NTV Telugu Site icon

Harsimrat Badal: మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు

Harsimrat Badal

Harsimrat Badal

Harsimrat Badal on AAP-led Punjab govt: పంజాబ్‌ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మంగళవారం లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో డ్రగ్స్‌ దుర్వినియోగం సమస్య, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లోక్‌సభలో కాల్‌ అటెన్షన్‌ తీర్మానంపై చర్చను ప్రారంభించిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌.. మద్యం తాగి పార్లమెంట్‌లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్‌ సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవాచ చేశారు. మాన్ దగ్గర కూర్చునే సభ్యులు తమ సీట్లను మార్చాలని కోరినట్లు కూడా ఆమె చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారుపై హర్‌సిమ్రత్‌ విమర్శలు చేసిన సమయంలో సభలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా నవ్వులు చిందించారు.

పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ బాదల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇలాగే ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని, రోడ్లపై ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని రాసి ఉన్నారని, అయితే తాగి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆమె అన్నారు. 2016లో వర్షాకాల సెషన్‌లో మాన్ తన వాహనం సెక్యూరిటీ బారికేడ్‌లను దాటి పార్లమెంట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు చూపించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గురించి కూడా ఆమె ప్రస్తావించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పలువురు ఎంపీలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు భవనం భద్రతను ప్రమాదంలో పడేసినందుకు మాన్‌ను పార్లమెంటరీ ప్యానెల్ దోషిగా నిర్ధారించింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు లోక్‌సభ నుండి సస్పెండ్ చేసింది. లోక్‌సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు మాన్.

Special Millet Lunch: పార్లమెంట్‌లో ప్రత్యేక మిల్లెట్ లంచ్.. ఖర్గేతో కలిసి ఆస్వాదించిన ప్రధాని 

వృత్తిరీత్యా హాస్యనటుడు​ అయిన భగవంత్ మాన్.. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్రూర్ స్థానం నుంచి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్ మాన్​ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ఎక్కువగా మద్యం సేవిస్తారని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి.