Site icon NTV Telugu

Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్.. ఆందోళనలో స్థానికులు

New Project (71)

New Project (71)

Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ బ్యారేజీ 15వ స్తంభం నుంచి 20వ పిల్లర్ వరకు వంతెన వంగి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. అయితే వంతెన కింద ఉన్న బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగడం వల్ల వంతెన కూడా కుంగిందా? లేక బ్యారేజీ గేట్లు, వంతెన మధ్య ఉండే సిమెంట్‌, ఐరన్‌ బీమ్‌ల మధ్య ఏదైనా లోపం వల్ల కుంగిందా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో మూడు గంటల పాటు బ్రిడ్జి దాటేందుకు ప్రజలను పోలీసులు ప్రయాణికులను అనుమతించడం లేదు. శనివారం చీకటి, నీరు ఉండడంతో నదిలో పిల్లర్ పరిస్థితి ఏంటో తెలియడం లేదని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఎన్ని స్తంభాలు కుంగిపోయాయే కాసేపట్లో స్పష్టత రానుంది.

Read Also:Israel Hamas War: తెరుచుకున్న ఈజిప్టు రఫా క్రాసింగ్… గాజాలోకి 20ట్రక్కులు

ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. గేట్ల నుంచి శబ్ధాలు వస్తున్నాయని.. తెల్లవారుజాము వరకు ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తిరుపతిరావు తెలిపారు. ఆదివారం ఉదయం అధికారులు బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్‌ 21న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్ ఈ బ్రిడ్జిని నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్‌ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శనివారం సాయంత్రం నుంచి 8 గేట్ల ద్వారా 14,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రాత్రివేళ మహారాష్ట్రకు వెళుతున్న వాహనదారులు వంతెన కుంగిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read Also:Priyanka Chopra : తల్లిని అయ్యాక నాలో ఆ మార్పులు వచ్చాయి..

Exit mobile version