Site icon NTV Telugu

YCP: వైసీపీ మేనిఫెస్టోకు ముహుర్తం ఖరారు..

Ycp Manifesto

Ycp Manifesto

వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని వైసీపీ చెబుతోంది. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటోంది. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.

ఇదిలాఉంటే.. మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని.. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని.. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనార్టీలకు 7 సీట్లు కేటాయించింది. ఇటు లోక్ సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. అందులో మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లను అదనంగా ఇచ్చింది వైసీపీ. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే.. 24 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు.

Exit mobile version