ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడతకు సంబంధించిన నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. తొలి విడతలో సాంకేతిక కారణాలు, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల లబ్ధి పొందని విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేసింది. ఈ రీ-వెరిఫికేషన్, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తికావడంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,29,201 మంది తల్లులు, విద్యార్థులను రెండో దశ కింద అధికారులు ఖరారు చేశారు.
ఇందుకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.10,208.69 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా విస్తరణతో రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య సుమారు 68.05 లక్షలకు చేరింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున కేటాయించగా, అందులో పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ నిధి కింద రూ.2,000 మినహాయించి మిగిలిన రూ.13,000 నేరుగా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. తొలి విడతలో పేర్లు రాని అర్హులైన వారందరికీ ఈ రెండో విడత ద్వారా త్వరలోనే నిధులు అందనున్నాయి. లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలు, పాఠశాల రికార్డులను సంబంధిత పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని పిల్లల డ్రాపౌట్ రేటును తగ్గించి, బడికి వెళ్లే పిల్లల సంఖ్యను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.

