TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో సమ్మె సైరన్ మోగించే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. దీనితో ఇవాళ సాయంత్రం లోగా ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి పొన్నం పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమ్మె అంశంపై సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రభుత్వం తమవంతుగా కొన్ని డిమాండ్లపై సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.
మరోవైపు అద్దె బస్సుల సంఘం ఈ సమ్మెకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. వారి పరిధిలో ఉన్న దాదాపు 3,500 అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని హైర్ వెహికల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో కొంతవరకు రవాణా సేవలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలను సమ్మెకు సిద్ధం చేశారు. సమ్మె అనివార్యమైతే ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులను కూడా వినియోగించుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైర్ వెహికల్స్ సంఘంతో మంత్రి పొన్నం భేటీ కానున్నట్లు సమాచారం.
