Site icon NTV Telugu

OTR: టీజీవో, టీఎన్జీవో మధ్య కోల్డ్ వార్? డీఏ పెంపుతో బయటపడిందా ?

Otr

Otr

OTR: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానమైన రెండు సంఘాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల సచివాలయంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమమే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది ఉద్యోగ వర్గాల్లో. అసలే ఉద్యోగ సంఘాల్లో ఉన్న సమస్యలకు ఈ వ్యవహారం ఆజ్యం పోసిందన్నది కొందరి విశ్లేషణ. ప్రస్తుతం ఉద్యోగుల జేఏసీలో సుమారు 208 సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో లక్షా 25వేల మంది ఉద్యోగులున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘంతోపాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, ఉపాధ్యాయ సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

READ ALSO: Jagityal : గాంధీభవన్ ను తాకిన జగిత్యాల సెగలు..మున్సిపల్ ఎన్నికలపై ఆందోళన

ఇక జేఏసీ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో… ఇటీవల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ యూనియన్‌ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు పెండింగ్‌ ఉన్న ఒక డీఏను ఈ కార్యక్రమంలో ప్రకటించారు సీఎం. మిగతా సంఘాలకు ఇదే ఇబ్బందిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల జేఏసీ పక్షాన టీజీవోలే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని కార్యక్రమం నిర్వహించి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం జరిగిందన్నది మిగతా వాళ్ళ ఆరోపణ. ప్రస్తుతం 64 పెండింగ్ అంశాలపై ప్రభుత్వంతో జేఏసీ పోరాడుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు ప్రధాన సంఘాలైన టీజీవో, టీఎన్జీవో మధ్య మనస్పర్దలు రావడంతో ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోందట. హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలతో చులకన అవుతామన్న అభిప్రాయం ఉంది ఎంప్లాయిస్‌లో.

జేఏసీ నాయకుల మధ్య మనస్పర్థలు రావడానికి మరో కారణం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల కొద్ది మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చాయి. వాటివల్ల వారికి గెజిటెడ్ హోదా దక్కింది. దీంతో…. టీఎన్జీవోలో కీలకంగా వ్యవహరించే అవకాశం కోల్పోతామని భావించి యూనియన్ బైలాస్‌లో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. వాళ్ళు అడిగినట్టు యూనియన్ బైలాస్‌లో మార్పులు చేస్తే మిగతా ఉద్యోగ సంఘాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఎలాంటి మార్పులకు అనిుమతించవద్దంటూ …. టీజీవోలు కోర్టును ఆశ్రయించారు. తీర్పు కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం తమకు గెజిటెడ్ హోదా మాత్రమే ఇచ్చి, జీతాల పెంపు, ఇతర అంశాలను స్పష్టం చేయని కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయంటూ ప్రమోషన్‌ వచ్చిన టీఎన్జీవోలు వాపోతున్నారు. ఈ క్రమంలో…. ఉద్యోగుల జెఎసి త్వరలో కీలక సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై చర్చించాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ మీటింగ్‌ తర్వాత ఇప్పుడున్న సంఘాలన్నీ జేఏసీలో కొనసాగుతాయా? లేక తప్పుకుంటాయా? అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది సెక్రటేరియెట్‌ సర్కిల్స్‌లో.

READ ALSO: Viral Video: యూఎస్‌లో గంటన్నర వైద్యానికి రూ.1.65 లక్షల బిల్లు.. వైరల్ అవుతున్న వీడియో!

Exit mobile version