NTV Telugu Site icon

Vizag Coast: రింగు వలల వివాదం..! విశాఖ తీరంలో మళ్లీ అలజడి

Vizag Coast

Vizag Coast

Vizag Coast: విశాఖ తీరంలో మళ్లీ అలజడి మొదలైంది. మత్స్యకార గ్రామాల మధ్య రింగు వలల వివాదం నివురు గప్పింది. ఎన్నికల సీజన్, సున్నితమైన వ్యవహరం కావడంతో పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. జాలరి ఎండాడ, వాస వాని పాలెంలో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పహారా కొనసాగుతోంది. ఇక్కడ రింగువలల మత్స్యకారులు, సంప్రదాయ జాలర్ల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నిషేధిత రింగు వలలతో వేటకు వెళ్లడాన్ని పెద్ద జలరిపేట మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వేట విధానంలో మత్స్య సంపద వృద్ధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చట్టబద్ధంగా రింగు వలలకు గతంలో అనుమతులు తీసుకున్నామని.. వాటితో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే అభ్యంతరంలో నిజం లేదంటున్నారు జాలరి ఎండాడ ప్రజలు. రాజకీయంగా కూడా ప్రస్తుతం వాతావరణం వేడి ఎక్కుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల మధ్య సామరస్య వాతావరణం కోసం పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Read Also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?

కాగా, గతంలో మంగమారిపేట తీరంలో సముద్రంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు, రింగ్‌ వలలతో వేట సాగిస్తున్న వారు కొందరు గాయపడ్డారు. ఇక, ప్రతిదాడి చేయడానికి పెదజాలరిపేట వాసులు భారీసంఖ్యలో సమీపంలోని వాసవానిపాలెం, జాలరిఎండాడలకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. మత్స్యకారులను నిలువరించేందుకు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.. చివరికి వారిని వెనక్కి పంపేయడంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్టు అయ్యింది.. మరోవైపు.. మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన వారి పడవలను కొందరు తమతో పాటు తీసుకువెళ్లి జాలరిపేట తీరంలో దహనం చేశారు. నాలుగు పడవలు పూర్తిగా, రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి.. ఇలా గతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడగా.. ఇప్పుడు మరోసారి విశాఖ తీరంలో అలజడి మొదలైంది.