TGTET Results 2026: తెలంగాణ ఇన్‌-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!

Tgtet

Tgtet

TGTET Results 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌-ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. జులై 21న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల (సెప్టెంబర్‌) 8, 9 తేదీల్లో మూడు విడతల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది (24 వేల మందికి పైగా) పరీక్షకు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ నవీన్ నికోలస్ ఫలితాలను వెల్లడించారు. పరీక్ష రాసిన వారిలో మొత్తం 15,749 మంది అర్హత సాధించగా, రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

విభాగాల వారీగా చూస్తే, పేపర్‌-1లో 4,942 మంది హాజరుకాగా 3,398 మంది (68.76%) అర్హత సాధించారు. అలాగే పేపర్‌-2 గణితం, సైన్స్‌ విభాగంలో 9,131 మంది పరీక్ష రాయగా 6,720 మంది (73.60%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌ విభాగంలో 8,404 మంది హాజరుకాగా 5,631 మంది (67.00%) అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలు, మార్కుల వివరాలు మరియు స్కోర్ కార్డును పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, వెబ్‌సైట్‌లోని ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే సమీపంలోని మీ-సేవ కేంద్రాల నుంచి కూడా మార్కుల వివరాలను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.