NTV Telugu Site icon

Telangana TDP: రాజమండ్రికి టి.టీడీపీ నేతలు.. ఫైనల్‌ కానున్న అభ్యర్థుల లిస్ట్..!

Kasani Gnaneshwar

Kasani Gnaneshwar

Telangana TDP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి.. అధికార బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తుంది.. మరోవైపు.. ఫైనల్‌ లిస్ట్‌పై అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు బీజేపీ కూడా కసరత్తు చేస్తున్నాయి.. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఖాయమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై చేపట్టి కసరత్తు తుది దశకు చేరుకుంది.. ఇప్పటికే ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన నందమూరి బాలకృష్ణ.. పోటీపై నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇవాళ రాజమండ్రిలో లిస్ట్‌ ఫైనల్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Read Also: Bhadrachalam: రేపటి నుంచి భదాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు.. 24న నిజరూపలక్ష్మిగా దర్శనం

రాజమండ్రిలోని టీడీపీ క్యాంపుకు చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ.. క్యాంపు కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, బాలకృష్ణ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు.. సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును ములాకత్‌లో కలిసి ఫైనల్‌ లిస్ట్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.. తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉన్న స్థానాలపై చర్చ సాగుతోంది.. చంద్రబాబుతో ములాకత్ తర్వాత టీడీపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఈ రోజు నారా లోకేష్‌, భువనేశ్వరితో పాటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా ములాకత్‌లో చంద్రబాబును కలవనున్నారు.. తెలంగాణలో పోటీచేసే అభ్యర్థులను అక్కడే ఫైనల్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ నేతలకు తాను అందుబాటులో ఉంటానని ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం విదితమే.