తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా (తెల్ల కాగితాలపై భూ క్రయవిక్రయాలు) క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కీలక ప్రకటనతో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల నిలిచిపోయిన సర్వే ప్రక్రియ, ఇప్పుడు మంత్రి ఇచ్చిన వెసులుబాటుతో వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణలో ‘అమ్మిన వారి’ నుంచి ధ్రువీకరణ పత్రం లేదా అఫిడవిట్ తీసుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. చాలా సందర్భాల్లో భూమి అమ్మిన వారు మరణించడం లేదా అందుబాటులో లేకపోవడంతో కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘అమ్మిన వారి ధ్రువీకరణ అవసరం లేదు, కొన్నవారు ఇచ్చే అఫిడవిట్ సరిపోతుంది’ అని స్పష్టం చేయడంతో వేలాది మంది దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.
Also Read:Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..
ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో సాదాబైనామా దరఖాస్తుల గణాంకాలు పరిశీలిస్తే.. మొత్తం 67,312 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హత పొందినవి 67,297. వీటిలొ ఆన్ లైన్ అయిన దరఖాస్తులు 15,229 ఉండగా.. 45,417 ఆర్డీఓ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 6,398 తహశీల్దార్ల వద్ద ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 18,440 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో కేవలం రెండే రెండు దరఖాస్తులు మాత్రమే పూర్తిస్థాయి సర్వే అనంతరం ఆమోదం పొందడం గమనార్హం.
Also Read:IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సర్వేలు ముందుకు సాగలేదు. ముఖ్యంగా అఫిడవిట్ల విషయంలో ఉన్న పేచీ వల్ల రెవెన్యూ యంత్రాంగం దరఖాస్తులను పక్కన పెట్టింది. ఇప్పుడు మంత్రి ప్రకటనతో పెండింగ్‌లో ఉన్న 45 వేలకు పైగా దరఖాస్తులపై ఆర్డీవో కార్యాలయం పునఃసమీక్ష చేసే అవకాశం ఉంది. సాదాబైనామాల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందితే.. రైతులకు ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, పంట రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. మంత్రి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చితే, ఖమ్మం జిల్లాలోని వేలాది రైతు కుటుంబాలకు భూమిపై పూర్తి హక్కులు లభిస్తాయి.
