ఎల్‌నినో ముప్పు కారణంగా వర్షపాతం తగ్గి కరవు లేదా పంట నష్టాలు సంభవించినా పేదలపై ధరల భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఎటువంటి ఆహార కొరత రాకుండా 14 నెలలకు సరిపడా బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం కోసం నెలకు 2.38 లక్షల టన్నులు, అనగా సంవత్సరానికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్ర బఫర్ గోదాముల్లో 9.64 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉండగా, మిల్లుల నుంచి రావాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ , ఇతర వనరుల ద్వారా మరో 18.39 లక్షల టన్నులు అందనున్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 28.03 లక్షల టన్నుల బియ్యం లభ్యం కానుండగా, ఇవి 2027 సెప్టెంబర్ వరకు సరిపోతాయని భావిస్తున్నారు.
మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యం గడువులోగా గోదాములకు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా, కష్టకాలంలో ప్రజలకు మరింత ఊరటనిచ్చేందుకు రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యమే కాకుండా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి ఇతర నిత్యావసర సరుకులను కూడా అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా ప్రజల ఆహార భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా ఈ కార్యాచరణను అమలు చేస్తున్నారు.

