తెలంగాణలో పేదల గృహ నిర్మాణానికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై – రూరల్)’ పోర్టల్తో అనుసంధానించే ప్రక్రియను హౌసింగ్ శాఖ ప్రారంభించింది. దీనిద్వారా రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు కేంద్రం నుంచి అదనంగా ఆర్థిక సహాయం అందుతుంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద తెలంగాణకు 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొత్తం నిధులను రెండు విడతల్లో నమోదు చేయనున్నారు. మొదటి దశలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇళ్ల వివరాలను పీఎం ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్లో అధికారులు అప్లోడ్ చేస్తున్నారు. ఇక రెండో దశలో మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో నివసిస్తున్న మరో 25 వేల మంది పేదలను గుర్తించి లబ్ధిదారులుగా చేర్చనున్నారు.
ఈ డేటా ఎంట్రీ, జియో టాగింగ్ ప్రక్రియను వేగంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయి యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. హౌసింగ్ సాంకేతిక అధికారులు ఎంపీడీవోలకు అవగాహన కల్పించగా, వారు గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు యాప్ వినియోగం, లబ్ధిదారుల వివరాల నమోదుపై పూర్తిస్థాయి ట్రెయినింగ్ ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని అక్టోబర్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆన్లైన్ నమోదు విజయవంతంగా పూర్తయిన వెంటనే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. పీఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.72 వేల సహాయం అందిస్తుంది. దీంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి, అలాగే ఉపాధి హామీ పథకం (వీబీ-జీరాంజీ) ద్వారా కూడా మరికొంత మొత్తం లబ్ధిదారులకు అందుతుంది. ఈ అనుసంధానంతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ వేగం పుంజుకోవడంతో పాటు పేదలకు పెద్ద ఎత్తున ఆర్థిక భరోసా కలగనుంది.

