NTV Telugu Site icon

Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో తప్పుల పరంపర.. విద్యార్థుల్లో ఆందోళన

Inter Exams

Inter Exams

Inter Exams : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతుండగా, ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉండటంతో, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్, బోటనీ, మ్యాథ్స్ వంటి ముఖ్యమైన పేపర్లలో ప్రశ్నలలో తప్పులు బయటపడటంతో, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజునే ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నలో తప్పు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ సమస్య ఇక్కడితో ఆగకుండా మరిన్ని సబ్జెక్టులకు విస్తరించింది. ఇవాళ బోటనీ పేపర్‌లో 5వ, 7వ ప్రశ్నల్లో తప్పులు బయటపడ్డాయి. మ్యాథ్స్ పేపర్‌లో 4వ ప్రశ్నలో పొరపాటు ఉంది. నిన్న జరిగిన పరీక్షల్లో కూడా మూడు పేపర్లలో తప్పులుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివినప్పటికీ, ప్రశ్నపత్రాల్లో తప్పుల కారణంగా తాము అనుకున్న విధంగా సమాధానాలు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు.

Chittoor Crime News: చిత్తూరు కాల్పుల ఘటన.. దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి!

ఈ సంవత్సరం తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు మార్చి 25 వరకు కొనసాగనున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో తప్పులను వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేశారు. పరీక్ష కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. ఈ చర్యలు అడ్మినిస్ట్రేషన్ పరంగా విద్యార్థులకు సురక్షితమైన పరీక్షా వాతావరణం అందించాలనే ఉద్దేశంతో చేపట్టినా, ప్రశ్నపత్రాల్లో తప్పుల వల్ల విద్యార్థులకు అశాంతి నెలకొంది.

ప్రశ్నపత్రాల్లో తప్పులు కొనసాగితే, తాము అన్యాయానికి గురయ్యామన్న భావన విద్యార్థుల్లో పెరుగుతుంది. ప్రశ్నపత్రాల రూపొందింపు ప్రక్రియను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు ఉన్న పేపర్లకు సంబంధించి విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని.. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ఈ పొరపాట్లను వెంటనే సరిచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

Mulugu Forest : అగ్నికి అడవులు ఆహుతి.. ములుగు జిల్లా అడవుల్లో మంటల విలయం