Telangana High Court Verdict on VYooham Movie Censor Certificate: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వైఎస్ జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ మాత్రం ఇష్టం లేదని ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ అన్నారని.. వ్యూహం సినిమాలో తమను కించపరిచేలా తెరకెక్కించారని లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. జనవరి 8న వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను సెన్సార్ బోర్డ్ న్యాయస్థానానికి అందజేసింది. సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు.. సెన్సార్ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని నేడు సెన్సార్ బోర్డును ఆదేశించింది.
Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన రోహిత్!
హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా వ్యూహం సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఆర్జీవీ డైరెక్షన్‌లో తెరకెక్కిన వ్యూహం సినిమాలో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వ్యూహం సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన వేంటనే వివాదాస్పదమైంది.