Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..

Sudarshan

Sudarshan

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియలో గ్రాడ్యుయేట్లకు ఉపశమనం కలిగించేలా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారమ్-18 దరఖాస్తు గడువుతో సంబంధం లేకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా ఓటరు నమోదుకు సంబంధించి సీఈఓ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ సాంకేతిక సమస్యల వల్ల మొరాయించడంతో వేలాది మంది పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమయానికి దరఖాస్తులు సమర్పించలేకపోయామని దరఖాస్తుదారులు ఆందోళనకు గురికావడంతో స్పందించిన అధికారులు త్వరలోనే ఆన్‌లైన్ సర్వర్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, సేవలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. దరఖాస్తు సమర్పణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోర్టల్‌ను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ , వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే.. సాధారణ ఫారమ్-18 దరఖాస్తుల ప్రాథమిక గడువు ముగిసినప్పటికీ, నామినేషన్ల ప్రక్రియ వరకు అవకాశం ఉండటంతో మిగిలిపోయిన అర్హులైన గ్రాడ్యుయేట్లు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, అధికారిక పోలింగ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. తుది ఓటర్ల జాబితా ప్రకటన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి.