Site icon NTV Telugu

Mahabubnagar: ప్రభుత్వ టీచర్‌కు టెండర్‌లో మద్యం షాపు.. ఉద్యోగం గోవింద..!?

Mbnr

Mbnr

Mahabubnagar Government Teacher Suspended: ఓ ప్రభుత్వ టీచర్‌కి మద్యం టెండర్ లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. కానీ.. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం పోయింది. ఈ ఘటన
మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే టీచర్ తాజాగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. రూ.3 లక్షల డిపాజిట్ చెల్లించి ధర్మాపూర్ వైన్స్‌కు దరఖాస్తు చేసుకున్న ఆమెకు అక్టోబర్ 26న జరిగిన డ్రాలో అదృష్టం కలిసొచ్చింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన లక్కీ డ్రాలో ఆమె పేరు రావడంతో పత్రాలపై సంతకాలు చేసి టెండర్‌ను ఖరారు చేసుకున్నారు. కుటుంబీకులు ఎంతో సంబురంగా భావించారు.

READ MORE: Jogi Ramesh PA: జోగి రమేష్ పీఏను వదిలి పెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?

అయితే ఈ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ప్రభుత్వ ఉద్యోగి మద్యం టెండర్‌లో పాల్గొనడంపై వ్యాపార వర్గాలు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో పుష్ప లీవ్ వేసుకుని టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు బయటపడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ఎలాంటి టెండర్ లేదా వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనకూడదని అధికారులు చెబుతున్నారు. ఈ వార్త జిల్లా వ్యాప్తంగా వైరల్‌ కావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలకు దిగారు. పీఈటీ పుష్పపై సస్పెన్షన్ విధిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఆమెను సస్పెండ్‌లో ఉంచనున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చివరికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో “ఉపాధ్యాయురాలు నుంచి వైన్స్ యజమాని?” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version