Telangana Drought Affected Mandals: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఖరీఫ్ 2026 సీజన్‌కు గాను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 జిల్లాల్లో పెద్దపల్లి, హైదరాబాద్ మినహా 31 జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. శాస్త్రీయ నివేదికలు, వర్షపాత గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 365 కరవు మండలాల్లో 111 మండలాల్లో తీవ్ర కరవు, 254 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో పేర్కొంది. ఈ కరవు నోటిఫికేషన్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 6 నెలల పాటు అమలులో ఉంటుంది.
కాగా, ప్రస్తుతం జాబితాలో లేని మిగతా మండలాల పరిస్థితులను కూడా ‘స్టేట్ డ్రాట్ మానిటరింగ్ సెల్’ నిరంతరం పర్యవేక్షిస్తుందని, తీవ్రతను బట్టి అవసరమైతే అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని మండలాలను కరవు జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం తెలిపింది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు తక్షణమే ఈ నోటిఫికేషన్‌ను ప్రచురించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు జారీయ్యాయి. అంతేకాదు.. రాష్ట్రంలో ఆరు జిల్లాలైన.. సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని మండలాలను కరవు జాబితాలో చేర్చింది. కాగా.. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల నేపథ్యంలో వెంటనే ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరువు మండలాల పూర్తి జాబితా కింది ఇచ్చాం.

