Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..

Telangana Logo

Telangana Logo

తెలంగాణలోని CURE పరిధిలో తాత్కాలిక , హైపర్‌ లోకల్ ప్రకటనల (యాడ్స్) ఏర్పాటుపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించి, తాత్కాలికంగా 5 నుంచి 10 హైపర్‌ లోకల్ ప్రకటనల కోసం 25 నుంచి 50 స్థలాలను గుర్తిస్తారు. ఈ స్థలాలను సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పరిశీలించి ఆమోదిస్తారు.

MyCURE లేదా అడ్వర్టైజింగ్ యాప్ ద్వారా 7 రోజుల ముందే స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నంబర్‌తో ఒక సమయంలో ఒకే స్లాట్ మాత్రమే బుక్ చేయడానికి అనుమతి ఉంటుంది. బుక్ చేసిన ప్రతి ప్రకటన కుడి దిగువన QR కోడ్, ఎడమ దిగువన ప్రింటర్ ఐడీ తప్పనిసరిగా ముద్రించాలి. నోడల్ అధికారి వీటిని స్కాన్ చేసి ధృవీకరించిన తర్వాత ఆ వివరాలను సంబంధిత పోలీసులకు పంపుతారు.

చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విగ్రహాలు, వారసత్వ కట్టడాలపై ప్రకటనలు పెట్టడాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే ట్రాఫిక్, పాదచారులకు, ట్రాఫిక్ సిగ్నల్స్. సీసీటీవీ ఉన్న ప్రదేశంలో ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే ప్రకటనలను మున్సిపల్, పోలీసు, హైడ్రా అధికారులు వెంటనే తొలగిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే చలాన్‌తో పాటు తొలగింపు ఖర్చులను కూడా దరఖాస్తుదారుడి నుంచే వసూలు చేస్తారు. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘించే ఏజెన్సీలు లేదా వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం కూడా ఈ కొత్త మార్గదర్శకాల్లో పొందుపరిచారు.