Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..

Atal Pension Yojana

Atal Pension Yojana

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘చేయూత’ పథకం కింద కొత్తగా 4,63,857 మందికి పింఛన్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంజూరు పత్రాల పంపిణీని ప్రారంభించగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల స్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు పత్రాలను అందజేస్తున్నారు. నవంబర్ 18 నాటికి ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా (DBT) మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం ఆర్థిక శాఖ అదనపు నిధులను కూడా విడుదల చేసింది. కొత్తగా మంజూరైన పింఛన్ లబ్ధిదారులలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40.44 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా, ఈ కొత్త లబ్ధిదారుల చేరికతో మొత్తం పింఛన్ దారుల సంఖ్య దాదాపు 45 లక్షలకు చేరుకుంది. నగదు జమ కావడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ (NPCI లింకింగ్) పూర్తయ్యేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.