Site icon NTV Telugu

Telangana Cabinet: పోడుభూములపై కేబినెట్లో కీలక చర్చ

Kcr Cabinet

Kcr Cabinet

శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షత రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాలను చర్చించి ఆమోదించింది. పోడు భూముల విషయంపై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవిన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్పేర్ శాఖల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో, ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది. అలాగే ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న దళిత బంధుపై కూడా చర్చ జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్థుతం అందచేస్తున్న 100 మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజక వర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధి దారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. జిహెచ్ ఎంసీ మరియు మున్సిపల్ కార్పోరేషన్లలో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జిహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు..ఇతర కార్పోరేషన్లలో 5 నుండి 10 వరకు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. సుంకిశాల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది.అందులో భాగంగా అదనంగా 33 టిఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అందుకు గాను రూ. 2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకై 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని కేబినెట్ తీర్మానించింది.భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

Read Also: Ryan Burl: చిరిగిన షూస్‌కు గమ్ అతికించుకున్నాడు.. ఆస్ట్రేలియాపై చెలరేగాడు..!!

Exit mobile version