School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..

Holidays

Holidays

ఆగస్టు నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు వరుస సెలవులు లభించే అవకాశం ఉం‍ది. వారాంతాలు, స్వాతంత్ర్య దినోత్సవం,  వివిధ పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు పలు రోజులు విరామం దక్కనుంది. అన్ని అధికారిక సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, కేవలం పది రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు రోజుల పాటు పాఠశాలలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు, ఆయా యాజమాన్యాల నిర్ణయాల ప్రకారం సెలవుల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల యాజమాన్యాలను సంప్రదించడం మంచిది.

మొదటి విడతగా ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘ విరామం లభించే అవకాశముంది. ఆగస్టు 8వ తేదీ రెండవ శనివారం కావడంతో మెజారిటీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. ఆగస్టు 9 ఆదివారం వారపు సెలవు కావడంతో పాటు ఆ రోజే బోనాల పండుగ వేడుకలు కూడా జరుగుతాయి. ఇక ఆగస్టు 10 సోమవారం రోజున బోనాల మరుసటి రోజు నిర్వహించే సాంప్రదాయ ‘రంగం’ కార్యక్రమం నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన హక్కుల అమలును కోరుతూ ఆదివాసీ జేఏసీ ‘మన్యం బంద్’ పిలుపునిచ్చినందున, ఆగస్టు 8న ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

ఆ తర్వాతి వారంలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 17 వరకు రెండోసారి మూడ్రోజుల సెలవులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగస్టు 15 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అయితే ఆ రోజు సాధారణ తరగతులు ఉండవు. ఆగస్టు 16 ఆదివారం వారపు సెలవు. ఆగస్టు 17 సోమవారం నాగపంచమి కావడంతో దీనిని ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, పాఠశాలల స్వంత నిర్ణయంపై ఈ సెలవు ఆధారపడి ఉంటుంది.

ఈ సెలవుల ఉన్నప్పటికీ తెలంగాణ అధికారిక విద్యా క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 2026లో మొత్తం 22 పనిదినాలు ఉంటాయి. ఒకటవ తరగతి విద్యార్థులకు ఆగస్టు 28 వరకు పాఠశాల సన్నాహక మాడ్యూల్ కొనసాగుతుంది, ఆగస్టు 29 నుంచి క్రమబద్ధమైన సిలబస్ ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని పాఠశాలలను ప్రభుత్వం ఆదేశించింది.