22A Registrations: తెలంగాణలోని 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పలు కఠిన షరతులతో అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ 2026 సెప్టెంబర్ 24న ఒక ముఖ్యమైన మెమోను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, సదరు ఆస్తికి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, బిల్డింగ్ లేదా అపార్ట్‌మెంట్ అనుమతులు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో HMDA, GHMC, CMC, MMC, DTCP లేదా సంబంధిత స్థానిక సంస్థల ఆమోదపత్రాలు తప్పనిసరి. అలాగే అనుమతి పొందిన తర్వాత నమోదైన చెల్లుబాటు అయ్యే, స్పష్టమైన లింక్ డాక్యుమెంట్లను బాధ్యులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం కోర్టు ఇచ్చే తుది తీర్పులు, ఆదేశాలకు లోబడే ఉంటాయి. వివాదాల్లో ఉన్న ఆస్తుల కేసు తీవ్రత, పరిధిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటి రిజిస్ట్రేషన్‌పై అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు, వివాదాలు తలెత్తినా వాటిని పరిశీలించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో అదనపు కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, HMDA లేదా సంబంధిత స్థానిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 22-A నిబంధనలకు సంబంధించి ఎదురయ్యే సందేహాలు, అభ్యంతరాలను ఈ జిల్లా స్థాయి కమిటీకి రిఫర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

