Site icon NTV Telugu

Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!

Tanishk Bagchi

Tanishk Bagchi

బాలీవుడ్‌లో రీమిక్స్ పాటలకు పెట్టింది పేరు తనిష్క్ బాగ్చి. టీవీ సీరియల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం ‘దిల్బర్’, ‘ఆంఖ్ మారే’ వంటి సెన్సేషనల్ సాంగ్స్ నుంచి గతేడాది వచ్చిన ‘సయ్యారా’ వరకు ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, యూట్యూబ్‌లో బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించినా, ఆర్థికంగా సంగీత దర్శకులకు దక్కాల్సిన గౌరవం, ప్రతిఫలం అందడం లేదని తనిష్క్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ‘రాయల్టీ’ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రతిభావంతులు ఎలా నష్టపోతున్నారో ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.

Also Read : Vijay:తాళి కటెప్పుడు చేతులు వణికాయి..రష్మికకు అది మూడోసారి కాబట్టి కూల్‌గా ఉంది..

తనిష్క్ బాగ్చి మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో నా పాటలకు 37 బిలియన్ల (3,700 కోట్లు) వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కలు ఏదైనా విదేశీ మ్యూజిక్ కంపెనీకి చెబితే, నాకో ప్రైవేట్ జెట్ ఉంటుందని వాళ్లు అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. విదేశాల్లో పాట రాసిన వారికి, కంపోజ్ చేసిన వారికి, సౌండ్ ఇంజనీర్లకు కూడా రాయల్టీలు వస్తాయి. అది వారికి ఆర్థిక భరోసా ఇస్తుంది. కానీ ఇండియాలో కేవలం ఒక్కసారి పారితోషికం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఆ తర్వాత ఆ పాట ఎన్ని కోట్లు సంపాదించినా మాకు వచ్చేది సున్నా’ అని వాపోయారు. అంతే కాదు ప్రచారం కోసం పీఆర్ (PR) వ్యవస్థ అవసరమని, కానీ చాలా మంది టాలెంటెడ్ మ్యూజిషియన్స్ దాన్ని భరించలేరని ఆయన పేర్కొన్నారు. ఐపిఆర్ఎస్ (IPRS) వంటి సంస్థల వల్ల ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారుతున్నాయని, భవిష్యత్తులో చిన్న టెక్నీషియన్లకు కూడా రాయల్టీ అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. టీవీ సీరియల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం ప్రస్తుతం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’, ‘ధడక్ 2’ వంటి భారీ చిత్రాల వరకు చేరిందని, ఎన్ని విజయాలు ఉన్నా ఇక్కడ నిలబడాలంటే ప్రతిరోజూ కొత్తగా పోరాడాల్సిందేనని తనిష్క్ స్పష్టం చేశారు.

Exit mobile version