Gold Theft in Kaveri Travels at Tanguturu: ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో కావేరి ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ కలకలం రేపింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడికి చెందిన సుమారు రూ.50 లక్షల విలువైన 300 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వివాహ కార్యక్రమం కోసం వెంకట కృష్ణ అనే వ్యక్తి బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్నాడు. అతడు కావేరి ట్రావెల్స్ బస్సులో బంగారు నగలతో కూడిన బ్యాగును వెంట తీసుకెళ్తున్నాడు. టంగుటూరు సమీపానికి చేరుకునే సమయానికి బ్యాగు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే వెంకట కృష్ణ టంగుటూరు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కావేరి ట్రావెల్స్ బస్సును టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బస్సులోని ప్రయాణికుల వివరాలు, లగేజీ, ఇతర ప్రాంతాలను పరిశీలిస్తూ చోరీకి సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే చోరీకి అవకాశం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన సమయంలో బస్సులో ఎవరెవరు ప్రయాణించారు?.. బంగారం ఉన్న బ్యాగును ఎవరు తీసుకెళ్లారు?.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది.

