Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!

Tamim Iqbal

Tamim Iqbal

Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అధికారికంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్ 7న జరిగిన బోర్డు సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 37 ఏళ్ల వయసులో బీసీబీ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా తమీమ్ చరిత్ర సృష్టించారు.

గత ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీసీబీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసిన తర్వాత తమీమ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బీసీబీ ఎన్నికలపై వచ్చిన ఆరోపణలను విచారించిన ఐదుగురు సభ్యుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన తమీమ్.. గత ఏడాదిన్నర కాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఎదుర్కొన్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. “గత ఏడాదిన్నరలో జరిగిన పరిణామాలు సరైనవి కావు. అయితే ఎవరినీ నిందించాలనే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే అందరి సహకారం అవసరం. ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు” అని ఆయన పేర్కొన్నారు.

×
×
Ad

బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్ఠకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తప్పులు జరిగితే వాటిపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, అలాంటి సూచనల ద్వారా బోర్డు మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మీడియాతో క్రమం తప్పకుండా మాట్లాడతానని.. బోర్డు భవిష్యత్ కార్యాచరణపై పారదర్శకంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు బోర్డుకు ఉపాధ్యక్షుడి నియామకాన్ని కూడా ప్రతిపాదించినట్లు తమీమ్ వెల్లడించారు. ఆ ప్రతిపాదన మేరకు ఫహీమ్ సిన్హాను ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మరో ఉపాధ్యక్షుడి ఎంపిక ఇంకా జరగలేదని, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపడతామని వివరించారు.