Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన

Cm Vijay

Cm Vijay

Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. తమిళనాడు శాసనసభ సాక్షిగా జోసెఫ్ విజయ్ సంక్షేమ పథకాల వర్షం కురిపించారు. పేద, అల్పాదాయ కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకాన్ని సోమవారం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ. 2.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. 2027 సంక్రాంతి పండుగ నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. పథకం కింద లబ్ధిదారులు సిలిండర్లు కొనుగోలు చేసిన అనంతరం, ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ (డీబీటీ) చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడటం, విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యుడిపై మోయలేని భారంగా మారాయని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం, ఎన్నికల హామీ నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కజగం ఎన్నికల సమయంలో ఏడాదికి 6 ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.

కేవలం గ్యాస్ సిలిండర్లే కాకుండా, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, మహిళల కోసం ఉన్న ‘వెట్రి పయనం’ (వెట్రి పయణ తిట్టం) ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని భారీగా విస్తరించారు. ఇప్పటివరకు కేవలం సాధారణ, కొండ ప్రాంత బస్సుల్లో 40 కిలోమీటర్ల పరిమితితో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇకపై ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్, అంతర్-జిల్లా సర్వీసులకు కూడా వర్తింపజేస్తున్నారు. ఏ మహిళ కూడా రవాణా ఖర్చుల వల్ల అవకాశాలను కోల్పోకూడదన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని విజయ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి ఈ విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా మారిన చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రైతులు, స్థానిక ప్రజల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పరందూర్ లో ఎయిర్‌పోర్టు నిర్మించే ప్రసక్తే లేదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఖాళీ చేయించకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, దీనికోసం ఇప్పటికే కొన్ని స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దీనికి తోడు ప్రస్తుతం మీనంబాక్కంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోనే సరికొత్తగా ‘టెర్మినల్ 5’ నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో వెల్లడించారు.