Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..

Tamil Nadu Breakfast Scheme

Tamil Nadu Breakfast Scheme

Breakfast Scheme: తమిళనాడు ప్రభుత్వం పాఠశాల పిల్లల కోసం అందిస్తున్న ఉదయం అల్పాహార పథకంలో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ మంగళవారం ఈ పథకం విస్తరణను అధికారికంగా ప్రారంభించారు. తిరువాన్మియూర్ గాంధీ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని పిల్లలకు టిఫిన్ వడ్డించారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి కింద కూర్చొని నాష్టా తిని, వారి క్లాస్‌రూమ్‌కు వెళ్లి సరదాగా కాసేపు ముచ్చటించారు. దివంగత పూర్వ ముఖ్యమంత్రి కే. కామరాజ్ గౌరవార్థం ఈ పథకానికి “పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్” అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయికే పరిమితమైన ఈ ఉచిత టిఫిన్ పథకాన్ని ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని దాదాపు 15.30 లక్షల మంది విద్యార్థులకు కొత్తగా లబ్ధి చేకూరనుంది. పిల్లలు రోజంతా ఉత్సాహంగా చదువుకోవాలంటే ఉదయమే పౌష్టికాహారం అందించడం చాలా అవసరమని భావించి తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విస్తరణ కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 217.63 కోట్ల అదనపు బడ్జెట్‌ను కేటాయించింది. దీంతో ఈ ఉదయం అల్పాహార పథకం మొత్తం బడ్జెట్ బారీగా పెరిగి రూ. 724 కోట్లకు చేరింది. నిజానికి ఈ విస్తరణ కార్యక్రమం సెప్టెంబర్ 17నే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటన కారణంగా కాస్త ఆలస్యమై మంగళవారం నాటికి వాయిదా పడింది. అయితే చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో మాత్రం ఈ విస్తరణ తక్షణమే అమలులోకి రావడం లేదు. అక్కడ అక్టోబర్ 6న మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నందున, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ రెండు జిల్లాలను తాత్కాలికంగా మినహాయించారు.

పిల్లలకు అందించే నాష్టా మెనూలో ఉప్మా, కిచిడీ, పొంగల్ వంటి పోషకాలతో కూడిన రుచికరమైన పదార్థాలను చేర్చారు. అంతేకాకుండా వారంలో రెండు రోజులు చిరుధాన్యాలు (మిల్లెట్స్)తో తయారుచేసిన ఆహారాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థలు ఉమ్మడిగా పర్యవేక్షిస్తాయి. స్కూళ్లలోని స్వయం సహాయక బృందాల (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) మహిళలే స్వయంగా ఈ నాష్టాను వండి పిల్లలకు వడ్డిస్తారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, స్కూళ్లకు హాజరు శాతం పెరుగుతుంది. చదువులోనూ మంచి పురోగతి కనిపిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.