Site icon NTV Telugu

Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!

2026 T20 World Cup

2026 T20 World Cup

Captaincy On The Edge: ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 8న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌తో కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. అయితే, ఈ టోర్నమెంట్ ఫలితాలు కేవలం ట్రోఫీ విజేతనే కాదు,
ప్రపంచ క్రికెట్‌లోని ఐదుగురు కీలక కెప్టెన్ల భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఈ ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఆ ఐదుగురు కెప్టెన్ల ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి!

1. సల్మాన్ అలీ ఆఘా (పాకిస్థాన్)
పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్లను మార్చడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే సల్మాన్ ఆఘా పదవికి గండం పొంచి ఉందని స్పష్టమవుతోంది. పాకిస్థాన్ జట్టు 2026 టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకోలేకపోతే పాక్ బోర్డు సల్మాన్ అలీ ఆఘా విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు నివేదికల ప్రకారం.. సల్మాన్ స్థానంలో అనుభవజ్ఞుడైన షాదాబ్ ఖాన్‌ను మళ్లీ కెప్టెన్‌గా నియమించే యోచనలో పీసీబీ (PCB) ఉందని సమాచారం.

2. దాసున్ శనక (శ్రీలంక)
ఈ మెగా టోర్నీకి సహ-ఆతిథ్య దేశంగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ప్రపంచకప్ పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. శ్రీలంక క్రికెట్ టీమ్ గ్రూప్ దశలో అదరగొట్టినప్పటికీ, సూపర్-8లో వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. టోర్నీకి కేవలం రెండు నెలల ముందు బాధ్యతలు చేపట్టిన శనక, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో జరిగిన టోర్నీలో ఘోర పరాజయం పాలైనందుకు, శ్రీలంక క్రికెట్ బోర్డు త్వరలోనే శనకను కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త కెప్టెన్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

3. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు, 2009 తర్వాత తొలిసారిగా మొదటి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి కెప్టెన్ మిచెల్ మార్ష్ బాధ్యత వహించాల్సి వస్తోంది. మార్ష్ వ్యక్తిగత ప్రదర్శన బాగున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్ అతిపెద్ద మైనస్‌గా మారింది. ప్రస్తుతం అతనికి 34 ఏళ్లు. 2028 ప్రపంచకప్ నాటికి అతనికి 36 ఏళ్లు వస్తాయి కాబట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియా యువ రక్తాన్ని కెప్టెన్‌గా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

4. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్)
గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్, ఈసారి రషీద్ ఖాన్ సారథ్యంలో కనీసం మొదటి రౌండ్ కూడా దాటలేకపోయింది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘన్ జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఘోరంగా విఫలం కావడం ప్రస్తుతం రషీద్ కెప్టెన్సీని ప్రశ్నార్థకం చేసింది. ఈ టోర్నీ తర్వాత జట్టు కెప్టెన్సీ నుంచి రషీద్‌ను తప్పించి జట్టును బ్యాటింగ్‌లో ముందుండి నడిపిస్తున్న ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

5. సూర్యకుమార్ యాదవ్ (భారత్)
భారత అభిమానులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, ప్రస్తుత పరిస్థితులు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రతికూలంగా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరడం ఇప్పుడు క్లిష్టంగా మారింది. సూపర్-8లో పేలవమైన ఆరంభం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒకవేళ భారత్ సెమీస్ చేరకుంటే, స్వదేశంలో వైఫల్యానికి బాధ్యతగా కెప్టెన్ మార్పు తప్పకపోవచ్చని చర్చలు జోరందుకున్నాయి. సూర్యకు ప్రస్తుతం 36 ఏళ్లు. తదుపరి టీ20 ప్రపంచకప్ నాటికి అతను జట్టులో ఉండటం కష్టమే కాబట్టి, బోర్డు హార్దిక్ పాండ్యా లేదా శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించవచ్చని చెబుతున్నారు.

ఏ క్రీడలోనైనా గెలిచినప్పుడు కెప్టెన్ ఆకాశానికి ఎత్తుతారు, పొరపాటున ఓడిపోయినప్పుడు అదే స్థాయిలో నాయకుడిని విమర్శలు చుట్టుముట్టడం సహజం. ఈ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు ఇప్పుడు వారి జట్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: UBS OTT Rights: నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ డీల్.. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’కు రికార్డ్ బ్రేకింగ్ ధర!

Exit mobile version