Site icon NTV Telugu

Preneet Kaur: బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య, పాటియాలా ఎంపీ

Bjp

Bjp

గతేడాది సస్పెండ్‌కు గురైన కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ గురువారం బీజేపీలో చేరారు. పాటియాలా ఎంపీగా ఉన్న ఆమెను గత ఏడాది కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.

2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ వైదొలిగారు. అనంతరం సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం బీజేపీలో విలీనం చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో కౌర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు.

గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో కౌర్ బీజేపీలో చేరారు. ఈ సంద్భంగా ప్రధాని మోడీపై కౌర్ ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి మోడీ చేసిన కృషిని ఆమె అభినందించారు.

తాను బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని కౌర్ పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో లోక్‌సభ, అసెంబ్లీలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. అందరూ కలిసికట్టుగా ప్రధాని మోడీని, ఆయన విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె చెప్పుకొచ్చారు.

కౌర్ వంటి నేతలను చేర్చుకోవడం వల్ల పంజాబ్‌లో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వ్యాఖ్యానించారు. ఎన్నో కమిటీల్లో పనిచేసి ఆమె.. తన సత్తా ఏంటో ప్రణీత్ కౌర్ నిరూపించుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు బీజేపీలోకి వస్తే పార్టీ బలపడుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమిలో భాగమైనా.. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. ఇక తాజాగా బీజేపీలో చేరిన కౌర్‌కు తిరిగి పాటియాలా నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.

2019లో పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆప్-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.

ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవా, చండీగఢ్‌ సీట్ల పంపకాల ఒప్పందాలపై రెండు పార్టీల మధ్య ఒప్పందాలు జరిగినప్పటికీ పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పంజాబ్‌ ఆప్ ప్రకటించింది. ఐదుగురు రాష్ట్ర మంత్రులతో సహా ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆప్‌ గురువారం విడుదల చేసింది.

మరోవైపు 2020లో రైతు నిరసనలతో ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్‌తో పొత్తును పునరుద్ధరించుకోవడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

 

 

Exit mobile version