Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Pending E Challans

Pending E Challans

Pending E-Challans- Supreme Court: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు పడే చలాన్లను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? ‘ఏముందిలే.. తర్వాత చూసుకుందాం’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇకపై ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా అలాగే వదిలేస్తే బండి జప్తు అవ్వడమే కాకుండా, పెండింగ్ ఫైన్లు ఉన్న వాహనాలకు సంబంధించి దాదాపు అన్ని రకాల ఆన్‌లైన్ సేవలను నిలిపివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ, పెండింగ్ ఈ-చలాన్లు ఉన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేవలం చలాన్లు విధిస్తే సరిపోదని, వాటిని వసూలు చేయడంలో స్పష్టమైన చర్యలు ఉండాలని జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జారీ అవుతున్న చలాన్లలో దాదాపు 47 శాతం వరకు పెండింగ్‌లోనే ఉండటంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు ఇకపై అకస్మాత్తుగా రోడ్లపై తనిఖీలు (ర్యాండమ్ చెక్స్) చేసి, పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలితే ఆ వాహనాలను వెంటనే సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఇక, చలాన్లు చెల్లించకపోతే ఎదురయ్యే చిక్కులు మామూలుగా లేవు. బాకీ బకాయిలు తీర్చేవరకు సదరు వాహనాలకు సంబంధించిన పలు ఆన్‌లైన్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) రెన్యూవల్ చేయడం కుదరదు, నకిలీ ఆర్‌సీ (డూప్లికేట్ RC) ఇవ్వరు, అలాగే యజమాని అడ్రస్ మార్చాలన్నా కుదరదు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ నిరాకరించడమే కాకుండా, పరివాహన్ పోర్టల్‌లో ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ఇక వాహనాన్ని వేరొకరికి అమ్మాలన్నా లేదా వేరే పేరు మీదకు మార్చాలన్నా (ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్) కుదరదు. అన్నింటికంటే ముఖ్యంగా, పెండింగ్ చలాన్లు ఉన్న బండ్లకు పొల్యూషన్ (PUC) సర్టిఫికేట్ కూడా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

ఒక్కసారి కాకుండా పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లపైనా కఠిన చర్యలకు కోర్టు పిలుపునిచ్చింది. పలుమార్లు నియమాలు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను నిలిపివేయడంతో పాటు, ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న లైసెన్సులను కూడా సస్పెండ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-చలాన్లు జారీ చేయడమే తప్ప, పెండింగ్ సొమ్మును వసూలు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ-చలాన్ల రూపంలో ఏకంగా రూ. 49,194 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు కేవలం రూ. 26,175 కోట్లు మాత్రమే వసూలైంది, మిగతా భారీ సొమ్ము ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. కేవలం కాగితాల మీద చలాన్లు రాయడం కాకుండా, క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరించి వసూలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించింది. మోటారు వాహనాల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 2012లో దాఖలైన ఈ పిటిషన్‌పై దాదాపు 14 ఏళ్లుగా విచారణ జరుగుతోంది. ఇన్ని సంవత్సరాలుగా తాము ఎన్నో ఆదేశాలు ఇస్తున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమైతే సహించేది లేదని, అధికారులు ఇకనైనా మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. కాబట్టి రోడ్డుపైకి వెళ్లేటప్పుడు నిబంధనలు పాటించడంతో పాటు, మీ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవడం ఎంతైనా మంచిది.