Supreme Court: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం వివాదం సీఎం విజయ్ సర్కార్‌ను చిక్కుల్లో పడేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు కొండపై ఉన్న దీపతూన్(దీప స్తంభం) వద్ద దీపాన్ని వెలిగించలేదు. దీంతో సుప్రీంకోర్టు శుక్రవారం తమిళనాడు ప్రభుత్వం, మధురై కలెక్టర్, ఆలయ ట్రస్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది కోర్టు ధిక్కారమే అని, అధికారులు- ఆలయ ట్రస్టీలు కలిసి కోర్టు నిర్ణయాన్ని అమలు చేయలేదని మండిపడింది. ఇలాంటి చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే, శనివారం దీపతూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే అని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ బాధ్యతల కోసం రీసవర్లను నియమించింది. ఇదే సమయంలో కొండపై ఆలయం, దర్గాను ఆధీనంలోకి తీసుకోవాలని సీఆర్పీఎఫ్ను ఆదేశించింది. నవంబర్ 24న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలగలేదు. సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపాన్ని వెలిగించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మధురై జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ, కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టం చేసింది.

