Site icon NTV Telugu

Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురు..

Supreme Court

Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ విచారణ కేసులో మమతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీపై బెంగాల్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఆర్‌పై స్టే ఇచ్చింది. ఐ ప్యాక్‌పై ఈడీ దర్యాప్తు సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను భద్రపరచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టులో ఇటీవల చోటు చేసుకున్న గందరగోళంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదని పేర్కొన్న ధర్మాసనం, ఈ విషయంలో నోటీసులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈడీ తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఐప్యాక్ కార్యాలయాలపై జరిగిన సోదాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు రాష్ట్ర అధికారులు తమ దర్యాప్తుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసం నుంచి ఆధారాలు తీసుకెళ్లారని, ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర పోలీసులను కూడా అక్రమాలకు ప్రోత్సహించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తూ, డీజీపీ రాజీవ్ కుమార్ సహా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

READ MORE: Tollywood Sankranthi: టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్.. 5 సినిమాలు, 4 హిట్లు.. బాక్సాఫీస్ షేక్!

జనవరి 9న కలకత్తా హైకోర్టులో ఈ కేసు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు గుమిగూడి గందరగోళం సృష్టించారని, దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఈ గందరగోళం ముందుగా వాట్సాప్ సందేశాల ద్వారా న్యాయవాదులను పిలిపించడంవల్లే జరిగిందని ఈడీ వాదించింది. తృణమూల్ లీగల్ సెల్ ఈ వ్యవహారానికి కారణమని పేర్కొంది. ఆ తర్వాత హైకోర్టు విచారణలకు సంబంధిత న్యాయవాదులకే అనుమతి ఇచ్చింది. ఈడీ ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని చెప్పడంతో, తృణమూల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే పార్టీకి సంబంధించిన గోప్య పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని తృణమూల్ ఆరోపిస్తోంది.

READ MORE: Pradakshina: గుడికి వచ్చి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..

మమతా బెనర్జీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ బెంగాల్‌కు రావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఐప్యాక్ ఎన్నికల నిర్వహణ చూసే సంస్థ అని, తృణమూల్‌తో అధికారిక ఒప్పందం ఉందని చెప్పారు. ఎన్నికల డేటా చాలా రహస్యమైనదని, అది బయటకు వెళ్తే ఎన్నికల్లో పోటీ ఎలా చేయగలమని ప్రశ్నించారు. అందుకే మమతా బెనర్జీ ఆ పత్రాలను రక్షించేందుకు అక్కడికి వెళ్లారని వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నోటీసులు జారీ చేయకుండా ఆపలేరని స్పష్టం చేసింది. ఎన్నికల డేటా స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉంటే ఈడీ అప్పుడే చేసేదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ తరఫున హాజరైన అభిషేక్ సింఘ్వీ.. ఈడీ ఒకే కేసును హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రస్తావించడం సరికాదని అన్నారు. జనవరి 9న గందరగోళం జరిగిందని ఒప్పుకుంటూనే, భావోద్వేగాల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనికి కోర్టు స్పందిస్తూ, భావోద్వేగాలు మళ్లీ మళ్లీ అదుపు తప్పకూడదని హెచ్చరించింది.

Exit mobile version