Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

Supremecourt

Supremecourt

Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వరుస ఘటనలో నేపథ్యంలో కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ అంశంపై జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సుమోటో పిల్ (PIL)ను తక్షణమే రిజిస్టర్ చేసి విచారణకు లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ గ్యాంగ్‌రేప్ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 21న ముగ్గురు వ్యక్తులు పోలీసులుగా నటించి ఆ బాలికపై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెలువడిన మీడియా కథనాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేవలం సెప్టెంబర్ నెలలోనే ఢిల్లీలో కనీసం 13 లైంగిక దాడి కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (NCR) పరిధిలో వరుసగా జరుగుతున్న ఈ అత్యాచార ఘటనలు చట్ట అమలు, ప్రజా భద్రతా వ్యవస్థల తీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా జస్టిస్ పర్దీవాలా వ్యాఖ్యానిస్తూ.. “దేశంలో ప్రస్తుత పరిస్థితులు మళ్లీ 2012 నాటి నిర్భయ దారుణ ఘటనను గుర్తుచేసేలా ఉన్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ ఘటన జరిగి దశాబ్ద కాలం గడిచినా వ్యవస్థల్లో అసలు సమర్థవంతమైన మార్పులు వచ్చాయా అని న్యాయస్థానం ప్రశ్నించింది. నగరంలోని పార్కులు, రహదారులు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు మహిళలకు హైరిస్క్ జోన్లుగా మారకూడదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా, ఎలాంటి హింసాత్మక భయాలు లేకుండా జీవించే హక్కు ఉన్మాద ప్రాథమిక హక్కు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యాచార ఘటనలపై కేవలం ఆందోళన వ్యక్తం చేయడం మాత్రమే సరిపోదని, నేరాల నివారణ, ప్రజా శాంతి, బాధితులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమవుతున్న బాధ్యతారాహిత్య అధికారులపై కచ్చితంగా అకౌంటబిలిటీ (జవాబుదారీతనం) ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పష్టం చేసింది.