Site icon NTV Telugu

Sunil Gavaskar: ఐపీఎల్ ఆడుతా.. 76 ఏళ్ల వయసులో గవాస్కర్ విజ్ఞప్తి!

Sunil Gavaskar

Sunil Gavaskar

భారత జట్టు ప్రస్తుతం యూఏఈలో ఆసియా కప్‌ 2025లో ఆడుతోంది. రెండు సూపర్-4 మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌ అనంతరం టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. తనను జట్టులోకి తీసుకోవాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోరినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆసియా కప్ 2025లో సునీల్ గవాస్కర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యాతో గవాస్కర్ మాట్లాడాడు. ఈ సంభాషణ గురించి బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ హోస్ట్ గౌరవ్ కపూర్ సన్నీని ప్రశ్నించాడు. ఇందుకు గవాస్కర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘నువ్వు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నావని హార్దిక్ నాతో అన్నాడు. సరే అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటానికి నన్ను పరిగణించమని చెప్పాను. అందుకు హార్దిక్ ఓకే చెప్పాడు’ అని సన్నీ సరదాగా చెప్పాడు. కొన్ని ఆఫర్లను తిరస్కరించడం కష్టం అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి.

Also Read: AP High Court: సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సునీల్ గవాస్కర్ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. గవాస్కర్ భారత్ తరఫున 125 టెస్ట్‌లు ఆడాడు. 34 శతకాలతో 10122 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున 10 వేల మైలురాయిని అందుకున్న మొదటి బ్యాటర్ సన్నీనే. టెస్టుల్లో మాదిరి గవాస్కర్ వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. 108 వన్డేల్లో 3092 రన్స్ చేశాడు. వన్డేల్లో ఒక సెంచరీ మాత్రమే చేశాడు. రిటైర్మెంట్ అనంతరం సన్నీ వ్యాఖ్యాతగా మారాడు. వ్యాఖ్యానంలో గవాస్కర్ తనదైన హాస్యంతో అందరినీ ఆకర్షిస్తాడు.

Exit mobile version